
నగరానికి మూడు వైపులా జాతీయ రహదారి
తల్లంపాడు నుంచి తీర్ధాలకు లింక్ చేస్తే పూర్తి స్థాయిలో రింగ్‌రోడ్
సీఎం కేసీఆర్ చొరవతో మహానగరాలకు దీటుగా మౌలిక సదుపాయాలు
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : జాతీయ రహదారుల నిర్మాణంతో ఉత్తర తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దులో ఉన్న ఖమ్మం నగరానికి సహజసిద్ధంగా రింగ్‌రోడ్ ఏర్పాటవుతున్నది. 2025 నాటికి జాతీయ రహదారుల నిర్మాణం పూర్తికానున్నది. జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయితే ఖమ్మం నగర రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న చర్యలతో ద్వితీయశ్రేణి పట్టణాలు మహానగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నది. కేసీఆర్ జాతీయ రహదారులను కేంద్రం నుంచి సాధించడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి ఆవశ్యకతను స్వయంగా ప్రధానికి వివరించారు. రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రితోపాటు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఎంపీల చేత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనేక జాతీయ రహదారులను సాధించారు.
ఖమ్మం నగరానికి మణిహారంలా..
హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం నగరానికి సహజ సిద్ధంగా రింగ్‌రోడ్ ఏర్పాటుకాబోతున్నది. ఖమ్మం నగరం నుంచి రెండు అతిపెద్ద జాతీయ రహదారులు వెళ్తున్నాయి. నాగపూర్- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు ఖమ్మం మీదుగా తెలంగాణ సరిహద్దు వరకు నిర్మిస్తారు. ఈ రోడ్డును రూ.6,700 కోట్లతో జాతీయ రహదారుల సంస్థ నిర్మిస్తున్నది. దీన్ని 2025 మార్చి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సూర్యాపేట- దేవరపల్లి హైవే ఖమ్మం మీదుగా వెళ్తున్నది. ఈ రోడ్డు ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు దాదాపు రూ.2,213.91 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ రోడ్డును 2024 ఏప్రిల్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తారు. దాదాపుగా రెండురోడ్లు ఖమ్మం నగరం నుంచి బైపాస్ కావడంతో నగరానికి మూడువైపులా నాలుగు లైన్ల జాతీయ రహదారులు ఏర్పడుతున్నాయి. ఈ రోడ్లు ఖమ్మానికి మణిహారంలా ఉంటాయి. వీటికి తోడుగా కోదాడ నుంచి ఖమ్మం వరకు మరో జాతీయ రహదారి నిర్మాణం అవుతున్నది. ఈ రోడ్డు వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం నుంచి కురవి వరకు మరో రహదారి నిర్మిస్తున్నది.
మరో 15 కిలోమీటర్లు నిర్మిస్తే పూర్తి స్థాయిలో రింగ్ రోడ్
ఖమ్మం నగరానికి జాతీయ రహదారుల నిర్మాణంతో మూడువైపులా నాలుగులైన్ల రింగ్ రోడ్ ఏర్పడుతున్నది. ఇది ఖమ్మం అబివృద్ధిలో మైలురాయిగా నిలువనున్నది. ఖమ్మం నగరం చుట్టూ రింగ్‌రోడ్డు ఏర్పడితే నాలుగువైపులా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యాపేట, వరంగల్ జాతీయ రహదారుల మధ్య లింక్ ఏర్పాటు చేస్తే ఖమ్మం పట్టణం చుట్టూ హైదరాబాద్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడుతుంది. ఈ రెండు జాతీయ రహదారుల మధ్య ఖమ్మం నగరానికి ఉత్తర భాగంలో లింక్ రోడ్డు ఏర్పాటు అయ్యేలా సూర్యాపేట- దేవరపల్లి జాతీయ రహదారిలో నగరానికి సమీపంలోని తల్లంపాడు నుంచి వరంగల్- విజయవాడ జాతీయ రహదారిలో ఖమ్మానికి సమీపంలో ఉన్న తీర్థాలను కలుపుతూ 15కిలోమీటర్లు రోడ్డు నిర్మిస్తే ఖమ్మం నగరానికి పూర్తి స్థాయిలో రింగ్ రోడ్ ఏర్పాటు అవుతుంది.