
జిల్లాలో కొనసాగుతున్న కొవిడ్ పరీక్షలు
వ్యాక్సినేషన్ కారణంగా తగ్గిన మహమ్మారి
వారం రోజుల్లోనమోదైన కేసులు జీరో..
ఒమిక్రాన్ రూపంలో దూసుకొచ్చిన కొత్త వైరస్..
అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ..
రెండో డోస్ టీకా, స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న అధికారులు
ఖమ్మం సిటీ, డిసెంబర్ 29 :ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ కరోనా కట్టడికి చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. నెల రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జిల్లా వ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ నెలలోని మొదటి మూడు వారాల్లో నమోదైన పాజిటివ్ కేసులు రోజుకు ఐదు మించకపోవడం.. వారం రోజుల నుంచి ఒక్క కేసు నమోదు కాకపోవడానికి ప్రధాన కారణం వ్యాక్సినేషనేనని వైద్యులు చెబుతున్నారు. అందుకే, మిగిలిపోయిన వారందరూ టీకా వేసుకోవాలని కోరుతున్నారు. ఇవన్నీ ఆచరించాల్సిన బాధ్యత ప్రజలది..! కాదని నిర్లక్ష్యం చేస్తే కొత్త వైరస్ బారిన పడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
‘ఎందరినో పొట్టన బెట్టుకున్న కరోనా కనుమరుగయ్యిందా? వందలాది కుటుంబాలను రోడ్డుపాలు చేసిన మహమ్మారి మాయమయ్యిందా? ప్రత్యక్ష దైవాలుగా కీర్తిస్తున్న వైద్యులనూ పొట్టన బెట్టుకున్న కొవిడ్‌కు కాలం చెల్లిందా? ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ విడుదల చేస్తున్న గణాంకాలను పరిశీలిస్తే నిజమనే అనిపిస్తోంది..! ప్రస్తుత డిసెంబర్‌లోని మొదటి మూడు వారాల్లో నమోదైన పాజిటివ్ కేసులు రోజుకు ఐదు మించలేదు. తాజాగా వారం రోజుల నుంచి ఒక్కటి కూడా నమోదు కాకపోవడం గమనార్హం. వీటి ఆధారంగా ఖమ్మం జిల్లాలో కరోనా కట్టడి చేసినట్లుగా అధికారులు, ప్రజలు భావిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడించిన కొవిడ్ తగ్గుముఖం పట్టడానికి కారణాలు అనేకం. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత ప్రచారం సబ్బండ వర్గాల్లో సంపూర్ణ చైతన్యాన్ని రగిలించింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఎవరికి వారే స్వీయ జాగ్రత్తలు పాటిస్తున్నారు. పెళ్లిళ్లు ఇతర వేడుకల సందర్భంలో భౌతిక దూరానికి స్వస్తి పలికినా ముఖానికి మాస్క్‌ను తప్పనిసరిగా ధరిస్తున్నారు. అదేవిధంగా కొర్పొరేట్ వ్యవస్థను తలదన్నే రీతిలో సర్కారు దవాఖానలను బలోపేతం చేయడం మంచి ఫలితాలను ఇచ్చిందనే వాదన వినిపిస్తున్నది.
వ్యాక్సినేషన్ ప్రధాన కారణమా..?
కొవిడ్ వైరస్ నుంచి ప్రాణాలు దక్కాలంటే టీకా ఒక్కటే శ్రీరామరక్ష అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించిన తెలంగాణ సర్కారు జిల్లా యంత్రాంగాలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చింది. మొదట్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ ఆ తర్వాత ప్రజలందరికీ సరిపడా డోసులు తెప్పించింది. దీంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షణలో ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అహర్నిశలు శ్రమించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 18 ఏండ్లు దాటిన వారందరికీ (వంద శాతం) ఫస్ట్ డోస్, 7,83,163 మందికి సెకండ్ ఇచ్చారు. దీంతో ప్రజలు వైరస్‌ను తట్టుకునే విధంగా రూపుదిద్దుకున్నాయని సీనియర్ వైద్యులు పేర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో నెల రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల నుంచి ఒక్క కేసు నమోదు కాకపోవడానికి ప్రధాన కారణం వ్యాక్సినేషన్ అని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో కరోనా పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఏ మాత్రం అనుమానం వచ్చినా సర్కారు దవాఖానాలను పరుగులు తీస్తుండడం గమనార్హం.
దూసుకొచ్చిన ఒమిక్రాన్
ఒమిక్రాన్ కొత్త వైరస్ ఖండాంతరాలను దాటుకుని ఎవరూ ఊహించని విధంగా ఖమ్మంలో ప్రవేశించింది. హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఒక యువతికి మూడు రోజుల క్రితం పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తక్షణం స్పందించిన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెను హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. బాధితురాలితో కాంటాక్ట్‌గా పరిగణిస్తున్న తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు సైతం వైద్యపరీక్షలు నిర్వహించారు. వారందరికీ నెగెటివ్ రిపోర్ట్ రావడం, ప్రస్తుతం ఆ బాధితురాలు కోలుకుంటుండడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నది. యువతికి ఒమిక్రాన్ పాజిటివ్ ఎలా వచ్చింది..? అనే కోణంలో రాష్ట్ర అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయా పరిణామాల నేపథ్యంలో ‘స్వీయ జాగ్రత్తలు’ అనే పదం మరోసారి తెరమీదకు వచ్చింది. కొత్త వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తోందని ప్రజలందరూ విధిగా ముఖానికి మాస్క్ ధరించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ బీ మాలతి విజ్ఞప్తి చేశారు. వేడుకలకు దూరంగా ఉండాలని, పదుల సంఖ్యలో ఒకేచోట గుమిగూడే పద్ధతికి స్వస్తి పలకాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మిగిలిపోయిన వారందరూ సెకండ్ డోస్ టీకా వేసుకోవాలని కోరుతున్నారు. ఇవన్నీ ఆచరించాల్సిన బాధ్యత ప్రజలది..! కాదని నిర్లక్ష్యం చేస్తే కొత్త వైరస్ బారిన పడడం ఖాయం..!