
విడతల వారీగా అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తాం..
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరు రూరల్, డిసెంబర్ 29 : ప్రజా శ్రేయస్సులో భాగంగా రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. బుధవారం 100 పడకల ఆస్పత్రిలో ట్రస్ట్, పుష్పగిరి రెటినో ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కంటిచూపు సమస్యతో బాధపడుతున్న ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో శస్త్రచికిత్స చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి తన అన్న రేగా విష్ణు జ్ఞాపకార్థం ప్రారంభించిన ట్రస్ట్ ద్వారా వైద్యం చేయించే అవకాశం తనకు రావడం ఆనందంగా ఉందన్నారు. ట్రస్ట్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు కోసం ఆర్థిక సాయం అందించామని తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో శస్త్రచికిత్స అవసరమైన వారికి పుష్పగిరి హైదరాబాద్ ఆస్పత్రికి ప్రత్యేక బస్సుల్లో తరలించి శస్త్రచికిత్స నిర్వహించి తిరిగి ఇంటికి చేర్చే వరకు పూర్తి ఉచితమన్నారు. ఈ కంటి వైద్యశిబిరాలు అన్ని మండలాల్లో జనవరి 2వ తేదీ నుంచి విడుతల వారీగా ప్రారంభమవుతాయన్నారు. డీసీహెచ్ఎస్ ముక్కంటేశ్వరరావు, ఏఎస్పీ డాక్టర్ శబరీష్, డీఎంహెచ్ఓ శిరీష మాట్లాడుతూ ఏజెన్సీ ప్రజలకు ట్రస్ట్ ద్వారా మెరుగైన వైద్యసేవలందించడం అభినందనీయమన్నారు. అనంతరం వారు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్యశిబిరంలో 1,456 మంది కంటి పరీక్షలు చేయించుకోగా 402మందికి శస్త్ర చికిత్స అవసరంగా గుర్తించి మొదటిరోజు 50మందిని హైదరాబాద్ తరలించారు. వారికి గురువారం శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో పుష్పగిరి ఆస్పత్రి ప్రతినిధి సుభాశ్, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ విజయ, గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, కుర్రి నాగేశ్వరరావు, వర్మ, బొలిశెట్టి నర్సింహారావు, కోలేటి భవానీశంకర్, కృష్ణార్జున్, మండల, పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, ముత్యం బాబు, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, సర్పంచ్ బచ్చల భారతి, మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.