e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home ఖమ్మం బీ అలర్ట్

బీ అలర్ట్

కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం
జిల్లా యంత్రాంగానికి సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం
సరిపడా బెడ్లు, పుష్కలంగా ఆక్సీజన్‌, మందులు..
ఖమ్మం పెద్దాసుపత్రిలో 500 బెడ్లకు ఆక్సీజన్‌ ఏర్పాటు
జిల్లా వైద్యాధికారులతో కలెక్టర్‌ గౌతమ్‌ ప్రత్యేక సమావేశం

ఖమ్మం సిటీ, నవంబర్‌ 29;ఒమిక్రాన్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నది. కొత్త వేరియంట్‌ వేగాన్ని శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ ముప్పు ముంచుకొచ్చినా ఎదుర్కొనేందుకు సర్కారు సిద్ధమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకునేందుకు సీఎం కేసీఆర్‌ రంగంలోకి దిగారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సోమవారం సాయంత్రం జిల్లా వైద్యారోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో బెడ్లు, ఆక్సీజన్‌, మందుల నిల్వలపై ఆరా తీశారు. కాగా, కొత్త వేరియంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు 500 బెడ్స్‌కు ఆక్సీజన్‌ సామర్థ్యాన్ని కల్పించారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వేర్వేరుగా కొవిడ్‌ వార్డులను సిద్ధం చేశారు. వాటిల్లో 90 బెడ్స్‌ పిల్లలకు, 40 బెడ్స్‌ పెద్దలకు కేటాయించారు. అన్నింటికీ ఆక్సీజన్‌ వసతి కల్పించారు. –

ఒమిక్రాన్‌ అత్యంత భయకరంగా ఉంటుంది.. ఈ మాటలంటున్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ అంతర్జాతీయ వైద్య నిఫుణులే. కొవిడ్‌ మొదటి, రెండు దశలకు భిన్నంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రెండేళ్ల క్రితం నాటి కొవిడ్‌-19 సమయంలో చేసిన విశ్లేషణలు అన్నీ అక్షర సత్యాలయ్యాయి. కాగా ఒమిక్రాన్‌ అనే కొత్త వేరియంట్‌ దేశం లేదా రాష్ట్రంలోకి ప్రవేశించలేదు. అయినా అలసత్వం తగదు. తక్షణమే నిర్లక్ష్యానికి స్వస్తి పలికి స్వీయ జాగ్రత్తలను పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ముఖానికి మాస్క్‌, బయటి నుంచి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లు, చేతులను శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాల్సిందే. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించాలి. ప్రధానంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై అపోహలను వీడి పద్దెనిమిదేండ్లు నిండిన వారంతా మొదటి, రెండో డోసు టీకాలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలు గాలిలో కలిసి పోవడం ఖాయం. కాగా రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ స్వీయ కార్యాచరణ ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, మందులు లభ్యత, ఆక్సీజన్‌ బెడ్స్‌ సామర్థ్యం, అత్యవసర వైద్యసేవలు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

జిల్లా యంత్రాంగం సిద్ధం..
కొవిడ్‌-19 మొదటి, రెండు దశలను ఎదుర్కొవడంలో ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌ అధికారులు చూపిన చొరవ, ప్రదర్శించిన ధైర్య, సాహసాలు అభినందనీయం. అనేక మంది వైద్యులకు, సిబ్బందికి వైరస్‌ సోకినా సేవే లక్ష్యంగా ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేశారు. తాజాగా ఒమిక్రాన్‌ అనే కొత్త వేరియంట్‌ సునామిలా బీభత్సం సృష్టించనున్నదని వైద్యనిఫుణుల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సారథ్యంలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశాలకు అనుగుణంగా రక్షణాత్మక చర్యలు చేపట్టారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ గుర్తిస్తూ టీకాలు వేస్తున్నారు. గతేడాది కరోనా సమయంలో జిల్లా వ్యాప్తంగా 49 ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు అనుమతినిచ్చారు. ప్రస్తుతం వాటిల్లో 1,460 బెడ్లు అందుబాటులో ఉన్నాయి.

పెద్దాసుపత్రిలో 500 బెడ్లు..

మొదటి, రెండో కరోనా దశల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నిరుపేదలకు వరంగా మారింది. సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతో కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ను తలదన్నే రీతిలో పెద్దాసుపత్రి సేవలు అందించింది. రోజుకు వందల సంఖ్యలో రోగులు పోటెత్తినా ఆక్సీజన్‌ నిల్వలు, రెమిడెసివిర్‌ ఇంజక్షన్స్‌, ఇతర మందుల విషయంలో కొరత రానీయలేదు. తాజాగా ఒమిక్రాన్‌ విషయంలోనూ అదే తరహా సేవలు అందించేందుకు దవాఖానను సిద్ధం చేస్తున్నారు. కొత్త వేరియంట్‌ విరుచుకుపడితే ఎదుర్కొనేందుకు 500 బెడ్స్‌కు ఆక్సీజన్‌ సామర్థ్యాన్ని కల్పించారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వేర్వేరుగా కొవిడ్‌ వార్డులను సిద్ధంగా ఉంచారు. వాటిల్లో 90 బెడ్స్‌ పిల్లలకు, 40 బెడ్స్‌ పెద్దలకు కేటాయించారు. అన్నింటికీ ఆక్సీజన్‌ వసతి ఏర్పాటు చేశారు. కాగా.. సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం జిల్లా వైద్యారోగ్యశాఖ, వైద్యవిధాన పరిషత్‌ అధికారులతో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సోమవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ఆరా తీయగా మొదటి డోస్‌ 74,740 మంది, సెకెండ్‌ డోస్‌ 68,868 మంది తీసుకోలేదని సమాధానమిచ్చారు. తక్షణమే వారందరికీ టీకాలు ఇవ్వాలని ఆదేశించారు.

స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష
ఒమిక్రాన్‌ అనే కొత్త వేరియంట్‌ రాష్ట్రంలో ఎక్కడా బహిర్గతం కాలేదు. ఒకవేళ జిల్లాకు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఇదే క్రమంలో ప్రజల నుంచి సహకారం ఉండాలి. ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా 18 ఏండ్లు దాటిన వారంతా టీకాలు తీసుకోవాలి. ముఖానికి మాస్క్‌ తప్పనిసరి. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటించాలి. సబ్బు లేదా శానిటైజర్‌తో కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

  • డాక్టర్‌ బీ మాలతి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, ఖమ్మం
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement