
కొత్తగూడెం, అక్టోబర్ 29: ధరణితో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అవకతవకలకు తావులేకుండా భూమి హక్కు పత్రాలు ఇంటికే వస్తున్నాయని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ధరణి పోర్టల్ వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం కలెక్టరేట్లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో భూమిపట్టా తీసుకోవాలంటే హక్కుదారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ధరణి వచ్చాక ఆ సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. దళారుల బెడద లేకుండా స్లాట్బుకింగ్తోనే ఇంటికి హక్కు పత్రాలు వస్తున్నాయన్నారు. గతంలో డివిజన్ కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండేవని, ఇప్పుడు ప్రతి తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ మ్యుటేషన్లు చేస్తున్నారని పేర్కొన్నారు. భూమి సమస్యలకు ప్రత్యేక లాగిన్ ఏర్పాటు చేయడంతో ఇతరులు ఎవరూ టాంపరింగ్ చేసే అవకాశం లేదన్నారు. కేవలం కలెక్టర్ లాగిన్ ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని, ఎవరికీ డబ్బులు ఇచ్చే పని లేదన్నారు. ఎలాంటి భూ సమస్యలున్నా మీ సేవా ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. స్లాట్బుకింగ్ ద్వారా పట్టా కోసం ఆన్లైన్ చేసుకుంటే ఇంటికే కొరియర్ ద్వారా పట్టాపుస్తకం వస్తుందని, ఇలాంటి ధరణి పోర్టల్ దేశంలో ఎక్కడా లేదన్నారు. ఒకసారి భూమి ఆన్లైన్లో నమోదయ్యాక ఎవరు చెప్పినా మార్పులు ఉండవని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి లెక్కలు తీయడం జరిగిందన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో ధరణిపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,539 భూ సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక్ చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.