
ఖమ్మం, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్.. భూముల సమస్యలకు పరిష్కార వేదికగా నిలిచిందని, రైతులకు సత్వర సేవలు అందించడానికి దోహదపడుతోందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ధరణికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు నేరుగా ధరణి పోర్టల్ ద్వారా తమ భూముల లావాదేవీలను చేసుకునే అవకాశం తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదని గుర్తుచేశారు. రైతుల వ్యవసాయ భూముల లావాదేవీలను పారదర్శకంగా కొనసాగించేందుకు ధరణి పోర్టల్ ఒక మంచి అవకాశమని అన్నారు. భూములకు సంబంధించిన అన్ని లావాదేవీలు ఒకేచోట నిర్వహించుకునే అవకాశం ఈ పోర్టల్‌తోనే లభించిందన్నారు. ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రైతులకు వ్యవసాయ భూముల లావాదేవీల సేవలందించేవని అన్నారు. కానీ ఇప్పుడు ధరణి పోర్టల్‌తో ప్రతి తహసీల్దార్ కార్యాలయమూ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే రిజిస్ట్రార్ కార్యాలయంగా మారిందని వివరించారు. జిల్లాలో ఈ ఏడాది కాలంలో 26 వేల లావాదేవీలు జరిగాయన్నారు. వీటిల్లో 12,264 విక్రయాలు, 7,735 గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు, 2,944 సక్సేషన్లు, 3,000 మార్ట్గేజ్లు జరినట్లు వివరించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకూ ధరణి పోర్టల్ ద్వారా అనేక లావాదేవీలు పొందే అవకాశం లభించిందన్నారు. ధరణి పోర్టల్‌లో రైతులకు సంబంధించిన ఇబ్బందులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని పరిష్కరిస్తోందని అన్నారు. గ్రీవెన్స్‌లో వచ్చే భూ సమస్యల పరిష్కారాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇప్పటివరకు గ్రీవెన్స్ ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో 17,473 భూ సంబంధమైన దరఖాస్తులను పరిష్కరించామన్నారు. ఇంకా మ్యుటేషన్, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు, నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన దరఖాస్తులు, కోర్టు కేసుల్లో ఉన్న దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్ పాల్గొన్నారు. తొలుత ధరణి పోర్టల్ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా కలెక్టర్ గౌతమ్ కేక్ కట్ చేశారు.