
అన్ని రకాల ఆటలకు శిక్షణ ఇస్తున్నాం
గ్రామీణ ఆటగాళ్లు వెలుగులోకి రావాలి
మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం
మంత్రి అజయ్‌కుమార్
పటేల్ స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే
ఖమ్మం సిటీ, ఆగస్టు 29: జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక రకాల క్రీడలకు ఖమ్మం కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం జాతీయ క్రీడల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తొలుత ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో అన్ని రకాల ఆటలకు అనుభవజ్ఞులైన కోచ్‌లతో శిక్షణ ఇస్తున్నామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు ప్రతిభావంతులుగా తయారు కావాలని అన్నారు. ఇటీవల అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు చెందిన పురుషులు, మహిళలు ఓవరాల్ చాంపియన్‌గా నిలువడం అభినందనీయమన్నారు.
గ్రామీణ ఆటగాళ్లను తీసుకురండి..
గ్రామీణ ప్రాంతాల్లో మెరికల్లాంటి ఆటగాళ్లు ఉంటారని మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. వారిని వెలుగులోకి తీసుకువచ్చి మెరుగైన శిక్షణ ఇప్పిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే క్రీడల్లో శిక్షణ ఇవ్వగలిగితే చక్కని ఫలితాలు ఉంటాయన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన క్రీడాకారులంతా శక్తివంచన లేకుండా శిక్షణ పొందాలని, అన్నిరకాల పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు.
క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి..
హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఖమ్మం పటేల్ స్టేడియంలో నిర్వహించిన వివిధ రకాల క్రీడా పోటీలను మంత్రి అజయ్ ప్రారంభించారు. ప్రధానంగా ఆర్చరీ పోటీల్లో స్వయంగా పాల్గొన్న ఆయన విల్లు ఎక్కుపెట్టి బాణాలను వదులుతూ క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపారు. విశిష్ట అతిథిగా హాజరైన కలెక్టర్ వీపీ గౌతమ్ సైతం అన్ని రకాల ఆటలను దగ్గరుండి ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీవైఎస్వో పరంధామరెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు షఫిక్ అహ్మద్, మందుల వెంకటేశ్వర్లు, సుదర్శన్, డాక్టర్ రఘునందన్, అనంతరాములు, కోచ్‌లు గౌస్, అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించారు. బాలురు, బాలికల కేటగిరీల్లో అథ్లెటిక్స్ అండర్ -16, వాలీబాల్ అండర్-19, బాస్కెట్‌బాల్ అండర్ -19, బ్యాడ్మింటన్ అండర్-17, లాన్ టెన్నిస్ అండర్-17, ఆర్చరీ అండర్ -18, కబాడీ అండర్-19, హాకీ అండర్-19, హ్యాండ్ బాల్ అండర్-19, స్కేటింగ్ పోటీలు జరిగాయి. వాటిని ఉదయం మంత్రి అజయ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రారంభించారు. విజేతలకు సీపీ విష్ణు ఎస్ వారియర్ సాయంత్రం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ యువతీ యువకులు సాధనచేసి అద్భుతాలను ఆవిష్కరించాలని ఆకాంక్షించారు.