
మణుగూరు ఏరియాలో లక్ష్యం చేరిన సోలార్ ప్రొడక్షన్
సమ్మర్లో రోజుకు లక్ష యూనిట్ల చొప్పున ఉత్పత్తి
స్థానిక అవసరానికి మించి మిగులుతున్న కరెంటు
అదనపు విద్యుత్‌ను ఎక్కడైనా వినియోగించుకునేలా ఏర్పాటు
ఏరియాలో రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.2.90 లక్షల ఆదా
మణుగూరు రూరల్, ఆగస్టు 29 : సింగరేణి మణుగూరు ఏరియా సౌర విద్యుత్‌ను విరజిమ్ముతోంది. ఇక్కడ సోలార్ పవర్ ప్రొడక్షన్ లక్ష్యానికి చేరుతోంది. వేసవి సమయాల్లో రోజుకు సగటున లక్ష యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండడం విశేషం. స్థానిక అవసరాలకు వినియోగించుకోగా.. మిగిలిన విద్యుత్‌ను సంస్థలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో మణుగూరు ఏరియాలో రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.2.90 లక్షల వరకూ ఆదా అవుతోంది. సౌరశక్తిని ఒడిసి పట్టుకొని సంస్థపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటోంది. ఇందుకోసం కొత్త కొండాపురం, అన్నారం గ్రామాల్లోని 145 ఎకరాల్లో రూ.135 కోట్ల వ్యయంతో 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేసింది. గతేడాది జూన్ 30న ఇది అందుబాటులోకి వచ్చింది.
సింగరేణి సంస్థ మణుగూరు ఏరియాలో సోలార్‌ప్లాంట్ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నది. సౌరశక్తిని ఒడిసి పట్టుకుంటూ.. సింగరేణిపై పడుతున్న విద్యుత్ భారాన్ని సోలార్ విద్యుత్‌తో భర్తీ చేసుకుంటున్నారు. సింగరేణి యాజమాన్యం తన పరిధిలోని భూమిలో కొత్త కొండాపురం, అన్నారం గ్రామాల్లోని 145 ఎకరాల్లో రూ.135 కోట్ల వ్యయంతో 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేసిన విషయం విదితమే. బీహెచ్ఈఎల్ సంస్థ ఈ ప్లాంట్‌ను గతేడాది జూన్ 30న సింక్రనైజేషన్ చేసింది. ప్రస్తుతం పూర్తిస్థాయి విద్యుత్ జనరేషన్ జరుగుతుండడంతో ఏరియాలోని కంపెనీ అవసరాలకు, కార్మికుల నివాసాలకు వినియోగిస్తున్నారు. దీంతో సింగరేణిపై విద్యుత్ భారం తప్పింది. మరోవైపు అదనపు ఆదాయ మార్గం చేకూరినట్లయింది. ఇంకోవైపు 30-35 మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి లభిస్తోంది.
రోజుకు రూ.2.90 లక్షల వరకూ ఆదా..
మణుగూరు ఏరియాలో ఏర్పాటు చేసిన 30 మెగావాట్ల ప్లాంట్‌లో ప్రస్తుతం పూర్తిస్థాయిలో విద్యుత్ జనరేట్ అవుతోంది. సోలార్ ద్వారా జనరేట్ అయిన విద్యుత్‌ను టీఎస్ ట్రాన్స్‌కో గ్రిడ్‌కు అనుసంధానించారు. అక్కడ నుంచి సింగరేణి వ్యాప్తంగా ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం ఉండడంతో కొంత విద్యుత్‌ను ఇతర ఏరియాల్లోనూ వినియోగించుకుంటున్నారు. ఏరియాలో కార్మికుల నివాసాలకు, వీధిలైట్లకు, కంపెనీ అవసరాలకు కలిపి నెలకు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల యూనిట్లు అవసరముంటుంది. ఎండాకాలంలో లక్ష యూనిట్ల సోలార్ విద్యుత్ జనరేట్ అవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అన్ సీజన్లో కొంతమేర విద్యుత్ జనరేషన్ తగ్గుతుందని చెబుతున్నారు. దాదాపు యూనిట్‌కు రూ.2.90 వరకు ఆదా అవుతున్నదని, దీనివల్ల రోజుకు సగటున సింగరేణికి రూ.2.90 లక్షల ఆదా అవుతున్నదని అధికారులు వెల్లడిస్తున్నారు. మణుగూరు ఏరియాలో ప్రధానంగా ఉన్న ఏరియా ఆస్పత్రి, జీఎం కార్యాలయాలపై సోలార్ పలకలు ఏర్పాటు చేసి ఆ విద్యుత్‌ను వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకునేందుకు ఏరియా జీఎం జక్కం రమేశ్ ఆదేశాలిచ్చారు.
భవిష్యత్‌లో రాబోయే విద్యుత్ అవసరాలను, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పర్యావరణ హితమైన ఈ సాంకేతిక పరిజ్ఞానం పట్ల సింగరేణి దృష్టి సారించింది. తెలంగాణ వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉండగా.. 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో ముందడుగు వేసింది. తొలిదశలో 129 మెగావాట్లకు శ్రీకారం చుట్టి.. నిర్మాణ బాధ్యతలను బీహెచ్ఈఎల్కు అప్పగించింది. మణుగూరులో 30 మెగావాట్లు, ఇల్లెందులో 39 మెగావాట్లు, రామగుండంలో 50 మెగావాట్లు, మంచిర్యాలలో (ఎస్టీపీసీ) 10 మెగావాట్లు ఉత్పత్తి అవుతున్నాయి. రెండో దశలో మందమర్రిలో 43 మెగావాట్లు, భూపాలపల్లిలో 10 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి నిర్మాణ బాధ్యతను అదానీ గ్రూప్‌కు అప్పగించారు. వీటిల్లో ఇప్పుడు కొన్ని పూర్తిస్థాయిలో సౌరశక్తిని వినియోగించుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. మిగతా ఏరియాల్లో పూర్తయిన మెగావాట్లను ఎప్పటికప్పుడు సింక్రనైజేషన్ చేసి గ్రిడ్‌కు అనుసంధానిస్తున్నారు. కొత్తగూడెంలో చేపట్టిన 37 మెగావాట్ల ప్లాంట్ మరో 15 రోజుల్లో పూర్తి కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. మణుగూరు ఏరియాలో మాత్రం ఏకకాలంలో 30 మెగావాట్లను సింక్రనైజేషన్ చేశారు. తీవ్ర వర్ష ప్రభావం ఉన్న రోజులు మినహా మిగతా అన్ని రోజుల్లో ఇక్కడ పూర్తిస్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.