
జేకే 5 ఓసీగానే విస్తరించే అవకాశం
మైనింగ్ ప్లాన్‌లో యాజమాన్యం
ప్రస్తుత ఓసీ కాలపరిమితి నాలుగు నెలలు
పర్యావరణ అనుమతుల కోసం ఎదురుచూపు
ఇల్లెందు, జనవరి 29 : మొన్నటివరకు పూసపల్లి ఓపెన్ కాస్టుపై సందిగ్ధం నెలకొంది. వాటన్నింటికీ తెరదించుతూ జేకే ఓసీగానే విస్తరించేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తున్నది. పూసపల్లి ఓపెన్ కాస్టుకు ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతులు రావాలంటే ఏళ్లు పడుతుంది. ప్రస్తుత జేకే 5 ఓసీ వచ్చే ఏడాది మార్చితో గడువు ముగిసే అవకాశం ఉంది. ఈ లోపు పూసపల్లి అనుమతులు రావడం కష్టం. అందుకే సింగరేణి యాజమాన్యం ఒక నిర్ణయానికి వచ్చింది. పూసపల్లి ఓసీ లేనట్లేనని చెప్పింది. దానికి బదులు జేకే ఓసీని విస్తరించే మైనింగ్ ప్లాన్ జరుగుతుందని స్పష్టం చేసింది. ఇల్లెందు-మహబూబాబాద్ ప్రధాన రహదారికి 70మీటర్ల దూరం నుంచి ఓపెన్ కాస్టు పనులు ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు. ఫారెస్టు, వాయుకాలుష్యం అనుమతులు వచ్చినా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. దాని కోసం యాజమాన్యం ఎదురుచూస్తున్నది. అనుమతులు వచ్చిన వెంటనే జేకే ఓసీని విస్తరించేందుకు ఓబీ పనులు ప్రారంభించనున్నారు.
ఓసీగా మారనున్న అండర్‌గ్రౌండ్ మైన్
వందేళ్ల చరిత్ర కలిగిన అండర్‌గ్రౌండ్ మైన్ ఓసీగా మారనుంది. జేకే ఓసీ విస్తీర్ణంలో భాగంగా మొదటి దశ పనులు అండర్‌గ్రౌండ్ మైన్ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన 21 ఇైంక్లెన్ మైన్ వివరాలు పరిశీలిస్తే.. 21మైన్‌ను 1889లో ప్రారంభించారు. సింగరేణిలో రెండో భూగర్భ గని ఇదే. 1946 వరకు దీన్ని స్ట్రట్‌పిట్ మైన్‌గా పిలిచారు. 1946 నుంచి సింగరేణి తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అప్పుడున్న స్ట్రట్ఫిట్కు బదులు 21మైన్‌గా నామకరణం చేసింది. ఇప్పటివరకు 11 ప్యానల్లో బొగ్గును వెలికితీశారు. బ్రిటీష్‌వారు ఒకటి నుంచి ఐదు ప్యానల్లో వెలికితీయగా.. మనవాళ్లు ఆరు నుంచి 11వరకు ప్యానల్లు వెలికితీశారు. ప్రస్తుతం 11వ ప్యానల్లో పనులు నిలిపివేశారు. సింగరేణి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ భూగర్భగనిలో 150లక్షల టన్నుల బొగ్గును వెలికితీసింది. సుమారు 60 వేల మంది కార్మికులు ఈ భూగర్భ గనిలో పనిచేశారు. బ్రిటీష్‌వారి హయాంలో పరిశీలిస్తే సుమారు 1.50 లక్షల మంది కార్మికులు ఈ గనికి సేవలందించారు. 21మైన్‌ను మూసివేస్తే దానిని అంటిపెట్టుకొని వర్క్‌షాపు, సీహెచ్‌పీ, జీఎం కార్యాలయం, ఏరియా స్టోర్స్, 21 మైన్ మేనేజర్ కార్యాలయాలు వేరే చోటుకు తరలించే అవకాశం ఉంది.
అనుమతుల కోసం ఎదురుచూపు
జేకే ఓసీ విస్తరించేందుకు మైనింగ్ ప్లాన్ సిద్ధం చేసుకున్న యాజమాన్యం అనుమతుల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. అన్ని ఫారెస్టు, పొల్యూషన్ అనుమతులు వచ్చినా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. గతంలో 21 అండర్‌గ్రౌండ్ మైన్ కోసం ఫారెస్టు క్లియరెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఓసీ రైట్స్ కోసం ఫారెస్టు నుంచి అనుమతులు తీసుకున్నది. సుమారు 600 హెక్టార్లలో ఓసీ విస్తీర్ణం చేపట్టే ఏర్పాట్లలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 106 హెక్టార్లకు ఓసీ రైట్స్ కోసం అటవీశాఖను సంప్రదించారు. మరో 60 హెక్టార్లు నాన్ ఫారెస్టు రైట్స్ కోసం సంప్రదిస్తుంది. జేకే5 ఓసీ విస్తీర్ణం చేపడితే.. 21 ఇైంక్లెన్ అండర్‌గ్రౌండ్ మైన్, జీఎం కార్యాలయం, టింబర్‌డిపో, ఏరియా ఆస్పత్రి, ఏరియా స్టోర్, వర్క్‌షాప్, 21 ఇైంక్లెన్ మేనేజర్ కార్యాలయం, సీహెచ్పీలన్నీ తరలించాల్సి ఉంటుంది. జేకే ఓసీ విస్తీర్ణం ఎందుకు చేపడుతున్నారంటే.. పూసపల్లి ఓసీ అనుమతులు పూర్తిస్థాయిలో రాకపోవడమే కారణమని తెలుస్తోంది. ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో వచ్చే ఏడాది మార్చికల్లా జేకే5 ఓసీ కాలపరిమితి ముగుస్తుంది. ప్రస్తుతం జేకే5 ఓసీలో సుమారు 300 మంది కార్మికులు పని చేస్తున్నారు. వారిని ఇతరచోట్ల సర్దుబాటు చేయడం సులభం కాదు. కాబట్టి జేకే ఓసీ విస్తీర్ణమే అందుకు సరైన ప్రత్యామ్నాయంగా ఏరియా అధికారులు భావించారు.
యథావిధిగా సీహెచ్‌పీ
కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ) తరలించే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్ – ఇల్లెందు రహదారికి 70 మీటర్ల దూరంలో ఓబీ డంప్ రావడంతో సీహెచ్‌పీకి ప్రమాదం లేనట్లేనని సమాచారం. మరో నాలుగు నెలల్లో జేకే 5 ఓసీ కాలపరిమితి ముగుస్తుంది. జేకే5 ఓసీ విస్తీర్ణణ కోసం పర్యావరణ అనుమతుల కోసం ఏరియా అధికారులు విస్తృతంగా సంప్రదింపులు చేస్తున్నారు. సుమారు 130 ఏళ్ల చరిత్ర కలిగిన సీహెచ్‌పీ సింగరేణి సంస్థకు ఎంతో తోడ్పాటునిచ్చింది. రవాణాలో పైచేయి సాధిస్తూ పలుమార్లు సీఎండీ ద్వారా బహుమతులు అందుకుంది. ఏరియా ఆస్పత్రి తరలించాల్సి వస్తే జేకే డిస్పెన్సరీని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇతర డిపార్ట్మెంట్లను వేరే చోట్లకు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఓసీ ప్రారంభమైతే 24 జీఎం బంగ్లాకు 60 మీటర్ల దూరంలో డంప్ చేసే అవకాశం ఉంది. తప్పనిసరిగా టింబర్‌డిపో మరోచోటుకు తరలించే అవకాశం లేకపోలేదు.