సర్కారు.. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా ఉంటానంది. పంటల సాగుకు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోంది.. రైతుబీమాతో రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది.. రాయితీపై పనిముట్లు అందిస్తూ సాగు సంబురమయ్యేలా చేసింది. రుణబాధతో రైతులు సతమతం కావొద్దని.. మాఫీ సైతం చేస్తామని మాటిచ్చింది.. ఆ మాటకు కట్టుబడి రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీని ప్రకటించింది. గురువారం నుంచి అమలు చేస్తూ అండగా నిలవనున్నది. అనునిత్యం రైతుల గురించి.. వారి పక్షానే నిలిచే సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ అండగా ఉంటామంటూ, మేమంతా ఆయన పక్షమే అంటూ రైతాంగం ముక్తకంఠంతో నినదిస్తోంది.
– ఖమ్మం, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రైతు సాధికారత సాధ్యం. రైతుల పంట రుణాల మాఫీతో ఇది మళ్లీ నిరూపితమవుతోంది. ఇప్పటికే మాఫీ చేసిన రుణాలు పోను మిగిలిన పంటల రుణాలను కూడా మాఫీ చేసేందుకు ఇంకో రూ.19 వేల కోట్లను సీఎం కేసీఆర్ వెచ్చిస్తున్నారు. ఇందుకోసం ఈ విడత రుణమాఫీ ప్రక్రియను గురువారం నుంచి పునఃప్రారంభించి సెప్టెంబర్ రెండో వారం లోపు సంపూర్ణం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్నదాతల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే వరకూ విశ్రమించబోమంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేయడం గొప్ప విషయం.
-రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రైతులకు ఆరాధ్య దైవంగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం గొప్ప విషయం. రుణమాఫీతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు మహర్దశ పట్టింది. రైతులకు రుణమాఫీ ప్రకటించి ఆర్థిక భరోసా కల్పించారు. సీఎం కేసీఆర్‌కే రైతుల సంపూర్ణ మద్దతు ఉంటుంది.
– మేకల చెన్నయ్య, రైతు, అబ్బుగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలం
ఖమ్మం, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నదాతలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మరోసారి రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈసారి రూ.లక్ష లోపు రుణం తీసుకున్న వారి రుణం మాఫీ కానున్నది. రుణమాఫీ ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 3.63 లక్షల మంది లబ్ధిపొందనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో రూ.25 వేలలోపు పంట రుణాలకు సంబంధించి రూ.28.48 కోట్లు, రూ.25 వేలు-రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులకు రూ.79.21 కోట్ల రుణం మాఫీ అయింది. తద్వారా 55 వేల మంది రైతులు లబ్ధి పొందారు. మరో 2 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.లక్షలోపు రుణాలు త్వరలో మాఫీ కానున్నాయి. భద్రాద్రి జిల్లాలో రూ.25 వేల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు 28,118 మంది కాగా రూ.62.47 కోట్లు, రూ.25- రూ.50వేల వరకు రుణమాఫీ పొందిన రైతులు 9,363 మంది కాగా రూ.30.81 కోట్ల రుణమాఫీ జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,63,187 మంది రైతులు రూ.లక్ష లోపు రుణమాఫీ పొందనున్నారు.
రూ.50-రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల రుణాలు ఈ1 నుంచి సెప్టెంబర్ 15 లోపు మాఫీ కానున్నాయి. అంచెలంచెలుగా రైతుల రుణాలను మాఫీ చేసేందుకు బుధవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అర్హత ఉన్న ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సీఎం నిర్ణయంపై ఉభయ జిల్లాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయ రంగ అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను గురువారం ప్రారంభించి 45 రోజుల్లో ముగించాలని సీఎం కేసీఆర్ బుధవారం అధికారులకు ఆదేశాలివ్వడం హర్షణీయమని అన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారని అన్నారు. ఎఫ్ఆర్బీఎం నిధులను కేంద్రం విడుదల చేయకపోవడం వల్లనే రుణమాఫీ ప్రక్రియ కొంత ఆలస్యమైందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరిగి చకదిద్దుకున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రైతుల రుణాల మాఫీకి ప్రకటన చేశారని అన్నారు.
– తాతా మధు
రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి కేవలం మూడు విడతల్లోనే రుణమాఫీ చేయబోతునారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చినంక రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు.
– జర్పుల లక్ష్మణ్‌నాయక్, సొసైటీ చైర్మన్, ఏదులాపురం
చింతకాని, ఆగస్టు 2 : రైతుల రుణమాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో బుధవారం మండలవ్యాప్తంగా రైతులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కొదుమూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జై కేసీఆర్.. జై కేటీఆర్ అంటూ నినదించారు. రైతులకు మిఠాయిలు, స్వీట్లు పంచిపెట్టి బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని, దేశానికే దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలవుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో మండలానికి చెందిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు రుణమాఫీ లబ్ధిదారులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమం కోసం రెండోసారి రుణమాఫీ చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. అనేక ప్రభుత్వాలు చూసినా.. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాక రైతులకు కలిసొచ్చిన కాలంగా చెప్పొచ్చు. రైతులకు ఏం కావాలో ముందుగా తెలుసుకొని తీరుస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్. తొలకరిలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం, అప్పుడు రుణమాఫీతో కష్టాలు తీర్చిన దేవుడు.
– మారుతి రమేశ్, శాంతినగర్, టేకులపల్లి మండలం
ఆఖరి విడతగా రుణమాఫీ రూ.లక్ష వరకు చేయాలని సీఎం ఆదేశించడంతో రైతు కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మూడోసారి సీఎంగా కేసీఆర్ అవుతారనడానికి ఎటువంటి అనుమానాలు లేవు. రైతులకు అండగా ఉండే నాయకుడు కేసీఆర్.అప్పు పుట్టదనుకునే వానకాలంలో రుణమాఫీ చేయడం సంతోషం.
– పూసం వెంకటేశ్వర్లు, సర్పంచ్, బెండాలపాడు
బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాం. పెట్టుబడికి తగిన దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. తీసుకున్న రుణం తీర్చే పరిస్థితి లేకపోవడంతో సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో రుణమాఫీ చేయడం ఆనందంగా ఉంది.
– పంచకర్ల సురేశ్, రైతు, అశ్వారావుపేట
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తుది విడతగా రూ.లక్ష వరకు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించడం అభినందనీయం. రైతులకు ఈ సమయంలో రుణమాపీ నగదు అందించడం వల్ల ప్రభుత్వం భరోసా ఇచ్చినైట్లెంది. సీఎం కేసీఆర్ మాటమీద నిలబడతారనడానికి ఈ ఆదేశాలే నిదర్శనం.
– బానోత్ రనియా, రైతు, రావికంపాడు, చండ్రుగొండ మండలం