
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 31: ఖమ్మం జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి తిరుమలయపాలెం మండలం అతలాకుతలమైంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా 16.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కేవలం తిరుమలాయపాలెం మండలంలోనే మూడు గంటలపాటు కురిసిన వర్షానికి 150.2 (15.2 సెంటీమీటర్లు) మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. కూసుమంచి మండలంలో 44.4 మి.మీ, ఖమ్మం రూరల్ మండలంలో 38.4 మి.మీ, ఖమ్మం అర్బన్ మండలంలో 32.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో కేవలం 10 మి.మీ లోపు మాత్రమే వర్షం కురిసింది. ఎగువన కురిసిన వర్షాలకు తిరుమలాపాలెం, కూసుమంచి మండలాల్లో చెరువులు మరోసారి మత్తడి దుంకాయి. పలు గ్రామాలకు ఉదయం రాకపోకలు నిలిచిపోయాయి. ఆకేరు వాగు నుంచి భారీగా వరద రావడంతో మున్నేరు మరోమారు ఉప్పొంగి ప్రవహించింది. తల్లాడ మండలంలో గంగిదేవిపాడు వాగు, కుర్నవల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
పాలేరుకు 22 వేల క్యూసెక్కులు
పాలేరు జలాశయానికి వరద పోటెత్తింది. మంగళవారం సాయంత్రం 22 వేల క్యూసెక్కుల వరద నీరు పాలేరుకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 24.5 అడుగులు చేరుకున్నది. 22,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేతుండడంతో అదే స్థాయిలో పాలేరు నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిపేశారు. పోలీసులు వాగుల వద్ద బందోబస్తు నిర్వహించారు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని పాలేరు రిజర్వాయర్ చుట్టూ ఉన్న గ్రామాల్లోకి నీరు చేరడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. పాలేరు వరద నీటిని ఎన్నెస్పీ ఈఈ సమ్మిరెడ్డి పరిశీలించారు. గతంలో పాలేరుకు సుమారు 16 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చింది. ఈ సారి అత్యధికంగా 22 వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాలేరు, ఇతర గ్రామాల్లోని వరదతో ఎలాంటి ఇబ్బందులు లేవని తహసీల్దార్ శిరీష తెలిపారు.
635 ఎకరాల్లో మునిగిన పైర్లు
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూసుమంచి మండలంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. 635 ఎకరాల్లో పంటలు నీట మునిగింది. నర్సింహులగూడెం – కిష్టాపురం రోడ్డులోని వాగుకు, నాన్‌తండా – నర్సింహులగూడెం గొల్లవాగుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో గైగొళ్లపల్లి, చౌటపల్లి, నర్సింహులగూడెం, కొత్తూరు, ఎర్రగడ్డతండా, సూర్యాపేట జిల్లా తుమ్మగూడెం, నేరడవాయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిష్టాపురం చెరువు నిండి భారీగా వరద నీరు పొలాల మీదుగా ప్రవహిస్తోంది. ఈశ్వరమాదారం – కోదాడ రోడ్డులో ఈశ్వరమాదారం -రాజుపేట మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కోదాడకు రాకపోకలు నిలిచిపోయాయి. 635 ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి పంటలు మునిగిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని కూసుమంచి ఏడీఏ విజయచంద్ర తెలిపారు.
లంకాసాగర్‌కు జలకళ
మండలంలోని మధ్య తరహా ప్రాజెక్టు లంకాసాగర్ జలకళను సంతరించుకుంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లంకపల్లి, చౌడవరం, మండాలపాడు ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి నీరు చేరి అలుగు ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ఈ ప్రాజెక్టును చూసేందుకు పలువురు లంకాసాగర్ వద్దకు వెళ్తున్నారు.
తిరుమలాయపాలెంలో భారీ వర్షం
తిరుమలాయపాలెం మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. 136 చెరువులు కుంటలు, ఆకేరు, 16 చెక్‌డ్యామ్‌లు మత్తడిపోస్తున్నాయి. హస్నాబాద్ సమీపంలోని కోతకు గురైన ముత్యాలమ్మ కుంటను అదనపు కలెక్టర్ మధుసూదన్, ఇరిగేషన్ సీఈ శంకర్‌నాయక్, ఎస్ఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. చెరువుకట్ట తెగిపోకుండా ఐబీ డీఈ బానాల రమేశ్‌రెడ్డి, తహసీల్దారు రవికుమార్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ముత్యాలమ్మ కుంట పొంగిపొర్లడంతో సుబ్లేడు – బచ్చోడు ప్రదాన బీటీ రహదారిపై నుంచి నీరు ప్రవహించింది. దీంతో ఆ రోడ్డూ కోతకు గురైంది.
భద్రాచలం వద్ద స్వల్పంగా పెరిగిన గోదావరి
భద్రాచలం, ఆగస్టు 31: భద్రాచలం వద్ద గోదావరి స్వల్పంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 17.3 అడుగులే ఉన్నది. సాయంత్రం 5 గంటలకు 17.4 అడుగులకు చేరుకున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి మరో రెండు నుంచి మూడు అడుగులు పెరిగే అవకాశం ఉన్నదని కేంద్ర జల వనరుల సంఘం అధికారులు తెలిపారు.