
యాసంగి సీజన్‌కు ఎకరానికి రూ.5 వేలు విడుదల
తొలిరోజు ఎకరాలోపు రైతుల అకౌంట్లలో సొమ్ములు జమ
లక్షలాది మంది రైతులకు అందిన సాయం పెట్టుబడి
నేడు 1-2 ఎకరాల భూమి కలిగిన రైతులకు..
హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 28: ‘రైతుబంధు’ పండుగ మొదలైంది.. రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతున్నది.. అన్నదాతలు యాసంగి సాగుకు కదిలే ఘడియలూ వచ్చేశాయి.. మంగళవారం తొలిరోజు ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది ఖాతాల్లో సొమ్ములు జమయ్యాయి.. ఇక పెట్టుబడికి ఇబ్బందులు లేవని, దర్జాగా సాగు చేసుకుంటామని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే అవసరం లేకుండా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.. ఈనెలాఖరు లోపు అర్వులందరి ఖాతాల్లో నగదు జమ చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.. ఎలాంటి సమస్య తలెత్తినా తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు..
ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ సకాలంలో రైతులకు పంటల పెట్టుబడి సొమ్ము పంపిణీ చేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నాలుగేండ్ల నుంచి ప్రతి సీజన్‌కు ముందుగానే రైతుబంధు పథకం ద్వారా పంటల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యాసంగి రైతుబంధు సొమ్ము పంపిణీ ప్రారంభమైంది. తొలిరోజు ఎకరాలోపు భూమి కలిగిన రైతుల అకౌంట్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ అయ్యాయి. దీంతో రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లి నగదు విత్‌డ్రా చేసుకున్నారు. ఆ సొమ్ముతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయనున్నారు.
ఈ యాసంగి సీజన్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3,16,422 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.362.84 కోట్లను జమ చేయనున్నారు. అందులో భాగంగానే మంగళవారం తొలిరోజున ఎకరాలోపు భూమి కలిగిన 1,13,994 మంది రైతులకు రూ.36.14 కోట్లు జమ చేశారు. బ్యాంకుల్లో జమ అయిన సొమ్మును రైతులు విత్‌డ్రా చేసుకున్నారు. బుధవారం నుంచి మరో పది రోజులపాటు రైతుబంధు సొమ్ము పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది.
నేటి నుంచి ఎకరా పైబడిన రైతులకు..
సన్న, చిన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యంలో రైతుబంధు సొమ్ము పంపిణీ చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధంచేశారు. డిసెంబర్ 28 నుంచి మొదలు కొని వచ్చే నెల 10 వరకు పట్టాదారు పాస్‌బుక్ కలిగిన ప్రతి రైతు అకౌంట్లో సొమ్ము జమ కానుంది. అధికారుల గణంకాల ప్రకారం ఎకరం లోపు భూమి కలిగిన రైతులు 1,13,994 మంది ఉండగా వీరికి రూ.36.16 కోట్లు అందజేయనున్నారు. 1-2 ఎకరాల భూమి కలిగిన రైతులు 81,577 మంది ఉండగా.. వారికి రూ.61.97 కోట్లు, 2-3 ఎకరాలు భూమి కలిగిన రైతులు 46,514 మంది ఉండగా వారికి రూ.58.33 కోట్లు, 3-4 ఎకరాల భూమి కలిగిన రైతులు 27,538 మంది ఉండగా.. వారికి రూ.48.32 కోట్లు, 4-5 ఎకరాల భూమి కలిగిన రైతులు 18,329 మంది ఉండగా.. వారికి రూ.42.82 కోట్లు, 5-6 ఎకరాల భూమి కలిగిన రైతులు 9,026 మంది ఉండగా.. వారికి రూ.24.73 కోట్లు, 6-7 ఎకరాల భూమి కలిగిన రైతులు 5,373 మంది ఉండగా.. వారికి రూ.17.42 కోట్లు, 7-8 ఎకరాల భూమి కలిగిన రైతులు 3,670 మంది ఉండగా.. వారికి రూ.13.76 కోట్లు, 8-9 ఎకరాల భూమి కలిగిన రైతులు 2,427 మంది ఉండగా.. వారికి రూ.10.31 కోట్లు, 9-10 ఎకరాల భూమి కలిగిన రైతులు 2,039 మంది ఉండగా.. వారికి రూ.9.71 కోట్లు. 10 ఎకరాల భూమి కలిగిన రైతులు 5,336 మంది ఉండగా.. వారికి రూ.39.26 కోట్ల చొప్పున తెలంగాణ సర్కారు రైతుబంధు పంటల పెట్టుబడి సాయం అందజేయనుంది.
రైతుబంధు సొమ్మును సద్వినియోగం చేసుకోవాలి
రైతుబంధు సొమ్మును రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సకాలంలో పంటల సాగు జరగాలని, రైతులు అప్పుల పాలు కావద్దనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పేరిట పంటల పెట్టుబడి సాయం అందజేస్తోంది. అవసరమైన మేర రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు, ఇతర సాగు పనులకు ఉపయోగించుకొని ఆర్థిక ప్రయోజనం పొందాలి. యాసంగి సీజన్లో అరుతడి, అపరాలు, నూనె గింజల సాగు చేపడితే ఆశించిన లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. రైతులు ఆ దిశగా ఆలోచించాలి.
-ఎం.విజయనిర్మల, డీఏవో, ఖమ్మం
తొలిరోజు 30 వేల మందికి..
భద్రాద్రి జిల్లాలో మొదలైన రైతుబంధు సాయం జమ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 28: భద్రాద్రి జిల్లాలో తొలి రోజు 30 వేలమందికి పైగా రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబందు పంటల పెట్టుబడి సాయం జమ అయింది. ఎకరం లోపు పొలం ఉన్న రైతులందరికీ కలిపి రూ.10 కోట్లు జమ అయ్యాయి. రెండు ఎకరాల వరకూ పొలం ఉన్న రైతులకు బుధవారం సొమ్ములు జమకానున్నాయి. మొదటి రోజు జమ అయిన పెట్టుబడి సాయాన్ని చాలా మంది రైతులు విత్ డ్రా చేసుకున్నారు.