
ఖమ్మం ఏఎంసీలో రోజు రోజుకూ పెరుగుతున్న పత్తి ధర
ఆన్లైన్ బిడ్డింగ్‌లో క్వింటాకు రూ. 9వేలు
చరిత్రలో తొలిసారిగా గరిష్ఠ ధర
ఆనందంలో ఉమ్మడి జిల్లా అన్నదాతలు
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 28 : బులియన్ మార్కెట్లో బంగారం ధరతో పోటీ పడుతున్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం (పత్తి పంట) ధర పోటీపడుతోంది. సాగు తగ్గడం, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినప్పటికీ సాగు చేసిన రైతులకు మార్కెట్లో పత్తిపంట సిరులు కురిపిస్తోంది. చరిత్రలో ఏనాడు పలకని విధంగా మంగళవారం ఊహించని రీతిలో ధర పలికింది. జాతీయ మార్కెట్లో తెలంగాణ పంటకు రికార్డు స్థాయిలో డిమాండ్ పలుకుతుండడంతో మార్కెట్లో ఖరీదుదారులు పంటను కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. పంట సీజన్ ప్రారంభం నుంచే సీసీఐ మద్దతు ధర కంటే అధికంగానే పలుకుతుండడం విశేషం. ఈ సంవత్సరం సీసీఐ మద్దతు ధర క్వింటాకు రూ.6 వేలు కాగా, సీజన్ ప్రారంభంలోనే ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.7 వేల చొప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. దీంతో జిల్లాలో ఎక్కడా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నెలాఖరులో రికార్డుస్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఆయా జిల్లాల నుంచి 494 మంది రైతులు 6,318 పత్తి బస్తాలను తీసుకొచ్చారు. అనంతరం జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో పాల్గొన్న ఖరీదుదారులు ఎక్కువ మొత్తంలో పంటను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో గరిష్ఠ ధర క్వింటాకు రూ.9 వేలు పలికింది. మధ్య ధర రూ.8,700, కనిష్ఠ ధర రూ.7 వేల చొప్పున నిర్ణయించి వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. మెజార్టీ రైతుల పంటకు రికార్డు స్థాయి ధర పలకడంతో పంటను తీసుకవచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొనుగోళ్ల ప్రక్రియను ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, సెక్రటరీ ఆర్.మల్లేశం పర్యవేక్షించారు.