
బొగ్గు బావులను కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలు
సింగరేణి గనులను వేలం వేసి ప్రైవేటుకు ఇవ్వొద్దు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల ఆందోళన
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా నిరసన
కొత్తగూడెం సింగరేణి/ రామవరం/ ఇల్లెందు/ మణుగూరు రూరల్/ టేకులపల్లి/ సత్తుపల్లి రూరల్, అక్టోబర్ 28: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బొగ్గు గనుల ప్రైవేటీకరణలో భాగంగా సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం వేసి ప్రైవేటుకు అప్పగిస్తుండడంపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి గనులను ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేశారు. బొగ్గు బావులను కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని సింగరేణి కార్యాలయాల వద్ద కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం, రామవరం, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి పరిధిలోని సత్తుపల్లి బ్లాక్-3, కోయగూడెం, శ్రావణ్‌పల్లి బ్లాక్, కేకే-5 బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తుండడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. వాటిని తిరిగి సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. అన్ని ఏరియాల్లోనూ సింగరేణి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.