
ఏడాదిన్నరగా బడులకే పరిమితమైన బస్సులు
ప్రభుత్వ నిర్ణయంతో కదిలిన బస్సులు
ఫిట్నెస్ కోసం రవాణాశాఖ కార్యాలయాల బాట
నిబంధనలు అతిక్రమిస్తే సీజ్ చేస్తామంటున్న రవాణాశాఖ అధికారులు
రఘునాథపాలెం, ఆగస్టు28:కొవిడ్ మహమ్మారి అన్నిరంగాలను కుదేలు చేసింది.. ఉద్యోగ, ఉపాధి రంగాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది.. వైరస్ విజృంభించడంతో విద్యాసంస్థలను మూసి వేశారు. విద్యార్థులందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో విద్యార్థులను తరలించే బస్సులు స్తంభించిపోయాయి. అయితే, రాష్ట్రంలో కొవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థల పునఃప్రారంభానికి చర్యలు చేపట్టింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన జరిగేలా కసరత్తు చేస్తున్నది. దీంతో ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న బస్సులు విద్యార్థులను కళాశాలలు, పాఠశాలలకు తరలించేందుకు సిద్ధం అవుతున్నాయి. బస్సుల ఫిట్నెస్ కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. ఫిట్నెస్ చేయించుకున్న తర్వాతే బస్సులను రోడ్డెక్కించాలని రవాణాశాఖ అధికారులు యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతబడ్డాయి. ఫలితంగా పిల్లల రవాణాకు ఉపయోగించే బస్సులు ఏడాదిన్నర కాలంగా పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లోనే ఉండిపోయాయి. రాష్ట్రంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించిన తెలంగాణ సర్కారు విద్యాసంస్థల పునః పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ‘ఫిట్నెస్’ సర్టిఫికెట్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లేందుకు ముందుగా బస్సులను మెకానిక్ షెడ్డులకు పంపుతున్నాయి. అన్ని హంగులతో బస్సులు సిద్ధమవుతున్నాయి. ఆ తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం రవాణాశాఖ కార్యాలయం వైపు వెళ్లనున్నాయి. మరోవైపు ఫిట్నెస్ చేయించుకున్న తరువాతనే బస్సులను రోడ్డెక్కించాలని..సెప్టెంబర్ 31నాటికి బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవాలని రవాణాశాఖ ఇప్పటికే జిల్లాలోని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు అదేశాలు జారీ చేసింది. అయితే శనివారం ఫిట్కోసం కార్యాలయానికి వచ్చిన బస్సులను పరిశీలించి సరిగ్గా ఫిట్లేకపోవడంతో బస్సులను తిరిగి వెనక్కి పంపించి వేశారు రవాణాశాఖ అధికారులు. ఈ నేపథ్యంలో అసలు ఫిట్కోసం ఎలాంటి నిబంధనలు పాటించాలో వివరించారు.
రవాణాశాఖ కార్యాలయం బాట పడుతున్న ‘బస్సులు’
ఫిట్కోసం ప్రైవేటు స్కూల్ బస్సులు రవాణాశాఖ కార్యాలయం ఎదుట బారులు తీరున్నాయి. మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ బస్సులను స్వయంగా పరిశీలించి ఫిట్నెస్ పత్రాలను జారీ చేసే పనిలో ఉన్నారు. అనుమానం వచ్చిన పలు బస్సులను తానే స్వయంగా డ్రైవ్ చేసి బస్సుల కండీషన్‌ను గమనిస్తున్నారు. ఫిట్నెస్ జారీలో ఏమాత్రం ఫైరవీలకు తలొగ్గకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరైన విధంగా లేని బస్సులను తిరిగి పంపించేస్తున్నారు. వేలాది రూపాయలు పోసి ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ప్రతీ విషయాన్ని శ్రద్ధగా తీసుకోవాలి. బస్సుల నిబంధనలు తప్పక తెలుసుకోవాలి. రావాణాశాఖ చట్టం ప్రకారం అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వివిధ విద్యాసంస్థలకు చెందిన మొత్తం 1046బస్సులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం నూతన విద్యాసంసవత్సరం ప్రారంభానికి ముందు ప్రతి ఏటా బస్సు ఫిట్నెస్ ప్రక్రియ మే 15వ తేదీతో ముగుస్తుంది. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూతబడి ఏడాదిన్నర కాలంగా బస్సులకు ఫిట్నెస్ చెక్ చేయలేదు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణ సర్కార్ అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభించడంతో ఫిట్నెస్ చేయించాలని అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి మళ్లీ ఫిట్నెస్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ తదితరాల పత్రాలన్నీ ఉండాలి. ఫిట్నెస్ చేయించుకున్నాకే బస్సులను రోడ్డెక్కించాలి.
ఫిట్నెస్ చేయించుకుంటేనే రొడ్డెక్కాలి..
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బస్సులకు ఫిట్నెస్ పత్రం ఉంటేనే రోడ్డెక్కించాలి. విద్యార్థుల రవాణా చేపట్టే విద్యార్థులు బస్సులకు తప్పక ఫిట్నెస్ చేయించుకోవాలి. అలా కాకుండా విద్యార్థులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే ఫిట్నెస్ గడువు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాల జారీ కాలేదు. కార్యాలయానికి వచ్చిన బస్సులను మాత్రం అన్ని రకాలుగా పరిశీలించి ఫిట్నెస్ పత్రం జారీ చేస్తున్నాం.
-తోట కిషన్‌రావు, జిల్లా రవాణాశాఖాధికారి