
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు తొలి విడత నిధులు విడుదల
ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి రూ.5 కోట్ల కేటాయింపు..
తొలి విడతగా రూ.2.5 కోట్లు మంజూరు
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రజాప్రతినిధులు
ఖమ్మం, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాల్లో మరింత అభివృద్ధి జరుగనున్నది. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయి. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.2.5 కోట్లు విడుదల చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నిధులతో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లభించింది.
శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయి. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోపాటు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడు బాలసాని లక్ష్మీనారాయణకు ప్రభుత్వం తొలి విడత నిధులు రూ.2.5 కోట్ల చొప్పున విడుదల చేసింది. 2018లో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.5కోట్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.2.5 కోట్లు విడుదల చేసింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించే పనిలో నిమగ్నమయ్యారు.
ఆమోదించే అధికారం మంత్రికే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలతోపాటు శాసనమండలి సభ్యుడు, ములుగు జిల్లా నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించిన నిధుల వినియోగానికి ప్రతిపాదించిన పనులను ఆమోదించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అప్పగించింది. ఏడాదికి రూ.5 కోట్ల నిధులు ఒక్కో శాసన సభ్యుడికి మంజూరు కానున్నాయి. ఇందులో 40శాతం నిధులను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వెచ్చించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు తమ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, అవసరాలు, నిర్మాణ పనులకు సంబంధించి సమీక్షలు నిర్వహించి ప్రాధాన్యతాక్రమంలో ఆయా పాఠశాలలకు అభివృద్ధి నిధులను కేటాయించేందుకు సమాయత్తమవుతున్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆమోదించాలి. అయితే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపిస్తారు. కలెక్టర్ వీటిని పరిశీలించి మంత్రి ఆమోదానికి పంపించనున్నారు. అంచనాలు రూపొందించిన అనంతరం పనులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనున్నది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ ఇప్పటికే రూ.1.75 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించారు. ఆయన పరిధిలో మూడు జిల్లాలు ఉన్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు సంబంధించి ఈ నిధులను వినియోగించనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ, వంతెనలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. ఖమ్మం జిల్లాలో రూ.80 లక్షల పనులకు ప్రతిపాదనలు పంపారు. వాటికి పరిపాలన అనుమతులు ఇవ్వాలని కోరారు.
నిధుల వినియోగంపై దృష్టి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు మిగిలిన ఎమ్మెల్యేలు నిధుల వినియోగంపై దృష్టిసారించారు. సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు, పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణం, తదితర పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
తొలి విడత నిధులు విడుదల
నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం ఏటా మంజూరు చేయనున్న రూ.5 కోట్ల నిధులు విడుదల చేస్తున్నది. తొలివిడతగా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు రూ.2.5 కోట్లు అభివృద్ధి నిధులు విడుదలయ్యాయి. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకూ ఈ నిధులు విడుదలయ్యాయి.
-సీపీవో శ్రీనివాస్, ఖమ్మం