
బాలల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం
ఏజెన్సీ అభివృద్ధి తెలంగాణతోనే సాధ్యం
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
భద్రాద్రి జిల్లాలో మంత్రి పర్యటన
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
కొత్తగూడెంలో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
కొత్తగూడెం, ఆగస్టు 28: బాలల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, దుమ్ముగూడెం, కొత్తగూడెంలో పర్యటించారు. దుమ్ముగూడెంలోని నర్సాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్లో బాలల శిశుగృహాన్ని, కొత్తగూడెం పట్టణంలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, అభివృద్ధి పనులను ప్రారంభించారు.
దళితవాడలను ధనికవాడలుగా మార్చేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ సెంటర్లో రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, డివైడర్‌లో పౌంటెన్, ప్రకృతి వనం, అంబేద్కర్ కాంస్య విగ్రహాలను శనివారం రాత్రి 9 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దళితులందరికీ ఉద్యోగులతోపాటు దళితబంధు ఇస్తామన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే వనమా అభినందనీయులని అన్నారు. కొత్తగూడేన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దారని, పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలు విద్యుత్ కాంతులతో విరజిమ్ముతున్నాయన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ చైర్మన్ సీతాలక్ష్మి, వనమా రాఘవేందర్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.