
ఆధునిక వసతులు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
వైద్య విద్య కోసం మెడికల్ కళాశాల ఏర్పాటు
సమీక్ష సమావేశంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు
ఖమ్మం, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందుకోసం రక్తహీనత ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పేదలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణుల ప్రసవానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు సజావుగా జరుగుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుదలే ఇందుకు నిదర్శనమని అన్నారు. భద్రాచలంలో గైనకాలజిస్టుల కొరత తీర్చేందుకు అవసరమైతే నిబంధనలు సడలిస్తామని, అక్కడ విధులు నిర్వహించే గైనకాలజిస్టుల వేతనాన్ని పెంచేందుకు పరిశీలిస్తామని తెలిపారు. రెండు జిల్లాల్లో ఆరోగ్య పరిస్థితులు, కొవిడ్ వ్యాక్సినేషన్, ఇంటింటి జ్వర సర్వే, ఆసుపత్రిలో ప్రసవాలు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్, మహిళలు, కౌమార దశ బాలికల్లో రక్తహీనత, సాధారణ ప్రసవాలు, గైనకాలజీ, ఆర్థో, కంటి శస్త్ర చికిత్సల పురోగతి పెంచాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖతోపాటు అనుబంధ శాఖల అధికారులు కొవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించారని ప్రశంసించారు. ఇకముందు కూడా ఇదే అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక ఏకాగ్రత చూపుతున్నారని, రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి 18 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఒకొకటి రూ.5 కోట్లతో ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఔషధాల కొరత సమస్య రావద్దన్నారు. సర్జికల్, మెడికల్ కోసం బడ్జెట్లో మరో రూ.వంద కోట్లు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసులో ఖమ్మం జిల్లా 103 శాతం, రెండో డోసు లో 94 శాతం లక్ష్యాలను సాధించిందన్నారు. ఖ మ్మం, కొత్తగూడెం జిల్లా ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక టెక్నాలజీ, మానవ వనరులను పెంచినప్పటికీ ఇంకా 3 శాతం ఇనిస్టిట్యూషన్ డెలివరీలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య 28 శాతం మాత్రమే ఉందని, పుట్టిన గంటలో తల్లి పాలు ఇస్తే పిల్లలు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటారని అన్నారు. శస్త్ర చికిత్సలకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరే ప్రతి పేషెంట్‌ను ఆరోగ్యశ్రీ కింద నమోదు చేయాలని, ఆర్థో, గైనిక్, కంటి శస్త్ర చికత్సలకు ఆయుష్మాన్భారత్ కింద నమోదు చేయాలని అన్నారు. భద్రాద్రి జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి రూ.66 లక్షలు మంజూరు చేశామన్నారు.
జిల్లాలో మెరుగైన వైద్య సేవలు: మంత్రి అజయ్
రాష్ట్ర రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మరింత మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు ఖమ్మంలో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రులను వంద బెడ్ల ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేసుకున్నామని, ఆ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకుంటున్నామని అన్నారు. త్వరలోనే రెండో డోసు కూడా వందశాతం పూర్తి చేసి ఖమ్మాన్ని వంద శాతం వ్యాక్సినేటెడ్ జిల్లాగా నిలుపుతామని మంత్రి అన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ఇంటింటి జ్వర సర్వే ద్వారా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆయూష్ కమిషనర్ అలుగు వర్షిణి, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్. రాహుల్, మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇన్చార్జి రమేశ్‌రెడ్డి, సీఎంవో ఓఎస్డీ గంగాధర్, డీఎంహెచ్వోలు డాక్టర్ మాలతి, డాక్టర్ దయానంద స్వామి తదితరులు పాల్గొన్నారు.