
రూ.17 కోట్లతో అధునాతన సౌకర్యాలు
నేడు ప్రారంభించనున్న మంత్రులు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 27 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం తల్లీబిడ్డల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. రూ.కోట్లు వెచ్చించి ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా కొత్తగూడెం పరిధిలోని రామవరంలో రూ.17 కోట్లతో ఎంసీహెచ్ భవనాన్ని నిర్మించింది. కలెక్టర్ అనుదీప్ పర్యవేక్షణలో సకల సౌకర్యాలు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఈ మేరకు వైద్యవిధాన పరిషత్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్రావు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ ఈ భవన సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు జిల్లా ఆసుపత్రిలో ఇరుకు గదుల్లో ఉన్న తల్లీబిడ్డల ఆసుపత్రిని వంద పడకలుగా మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆసుపత్రిలో వైద్యసిబ్బందిని కూడా ముందస్తుగానే భర్తీ చేసింది. వంద పడకల్లో పిల్లలకు 20 పడకలను కేటాయించారు. నలుగురు గైనకాలజిస్టులతోపాటు మరో 40 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో బుద్ధిమాద్యం పిల్లల కోసం ప్రత్యేక వార్డును కేటాయించారు. ఈ సందర్భంగా డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి ఎంసీహెచ్ మంజూరు కావడం ఈ ప్రాంత ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. కొత్తగూడెంలో ఇప్పుడు ఉన్న ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా ఉంటుందని, తల్లీబిడ్డల కోసమే ఏర్పాటు చేసినట్లు చెప్పారు.