
కూలీలను తరలిస్తున్న ట్రాలీని అతి వేగంగా ఢీకొట్టిన బొగ్గు టిప్పర్
అక్కడికక్కడే ఇద్దరు మృతి.. ఆస్పత్రిలో ప్రాణాలొదిలిన మరో ఇద్దరు
ఆరుగురికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
చండ్రుగొండ, జనవరి 28 :రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు వారివి.. కూలీనాలీ కలిసి చేసుకుంటున్న ఆ జీవితాలకు అదే ఆఖరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు. అంతసేపు సాఫీగా సాగిన ప్రయాణాన్ని మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చి ముగించింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. అతివేగం కారణంగా నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. మరికొంత మందిని క్షతగాత్రులను చేసింది. చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృత్యువాత పడ్డారు. మరో ఎనిమిదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కూలీలు కత్తి స్వాతి(26), వెక్కిరాల సుజాత(46) అక్కడికక్కడే మృతిచెందారు. గుర్రం లక్ష్మి(52), కత్తి సాయమ్మ(40) ఆస్పత్రిలో ప్రాణాలొదిలారు. మృతులంతా సుజాతనగర్ మండలం దళిత కాలనీకి చెందినవారే. దీంతో ఆ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతిచెందారు. మరో ఎనిమిదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు…ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర వరి నారు పీకే పని కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని దళిత కాలనీకి చెందిన పదిమంది వ్యవసాయ కూలీలు శుక్రవారం ఉదయమే ట్రాలీలో బయల్దేరారు. గంటపాటు ప్రయాణం సాఫీగా సాగింది. చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలోగల జాతీయ రహదారి పైకి ట్రాలీ ఎక్కింది. సరిగ్గా అప్పుడే& ఎదురుగా (సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వైపు) అతి వేగంతో వచ్చిన బొగ్గు టిప్పర్ ఢీకొంది. ట్రాలీ నుజ్జు నుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కూలీల్లో కత్తి స్వాతి(26), వెక్కిరాల సుజాత(46) అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు 108, ఇతర వాహనాల్లో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మరో ఇద్దరు కూలీలు గుర్రం లక్ష్మి(52), కత్తి సాయమ్మ(40) ప్రాణాలొదిలారు. తీవ్రంగా గాయపడిన మిగిలిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ట్రాలీని ఢీకొన్న వెంటనే టిప్పర్ అదుపు తప్పి జాతీయ రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. రోడ్డు పక్కనున్న షేక్ ఖాజాబీ, తేజావత్ కోదు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిపై ఒకవైపు మృతదేహాలు, మరోవైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు, ఇంకోవైపు ప్రత్యక్ష సాక్షుల భయాందోళనతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. స్వాతి(26), సుజాత(46) మృతదేహాలతో వారి కుటుంబ సభ్యులు ప్రమాద స్థలంలో రాస్తారోకోకు దిగారు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో కొత్తగూడెం డీఎస్పీ వెంకన్నబాబు, జూలూరుపాడు సీఐ నాగరాజు, కొత్తగూడెం డివిజన్లోని సీఐలు బందోబస్తు నిర్వహించి, ట్రాఫిక్‌ను మళ్లించారు.
మృతదేహాలతో ఆందోళన.. హామీతో విరమణ
చండ్రుగొండ, జనవరి 28: బొగ్గు టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మృతిచెందిన నిరుపేద కూలీల కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండుతో మృతదేహాలతో అఖిలపక్షం నాయకులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. వారితో కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత చర్చలు జరిపారు. మృతుల కుటుంబీకులకు సింగరేణిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చేందుకు, ఆర్థిక సహాయం అందించేందుకు సింగరేణి అధికారులు అంగీకరించారని ఆర్డీవో చెప్పారు. దీంతో అఖిలపక్షం నాయకులు ఆందోళన విరమించారు. చర్చల్లో సింగరేణి అడిషనల్ జీఎం రమణారెడ్డి, తహసీల్దార్ ఉషాశారద, అఖిలపక్షం నాయకులు కొణకండ్ల వెంకటరెడ్డి, నాగ సీతారాములు, దారా బాబు, లంకా విజయలక్ష్మి, సాబీర్‌పాషా, అన్నవరపు కనకయ్య, పూసపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ నగర్లో విషాద ఛాయలు
సుజాతనగర్, జనవరి 28: టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులందరిదీ సుజాతనగర్ మండలంలోని అంబేద్కర్ నగర్ గ్రామమే. ఇక్కడ తీవ్ర విషాదం అలుముకుంది. ఆటో ట్రాలీలో పది మంది ప్రయాణిస్తున్నారు. నలుగురు మృతిచెందారు.
గుర్రం లక్ష్మి: ఈమె భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరూ వివాహితులే. పెద్ద కొడుకు నర్సింహారావు కూడా కొన్ని రోజుల క్రితం చెరువులో చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు. అప్పటి నుంచి అతడి భార్య, ఇద్దరు పిల్లలకు గుర్రం లక్ష్మి పెద్ద దిక్కుగా ఉంది. తమకు దిక్కెవరంటూ ఆ ముగ్గురూ రోదిస్తున్నారు.
కత్తి స్వాతి: ఈమెకు ఇద్దరు చిన్న పిల్లలు సంజయ్ (6), వరుణ్ (7) ఉన్నారు. తనకు, ఇద్దరు బిడ్డలకు అన్యాయం చేసి వెళ్లిపోయిం దంటూ ఆమె భర్త కంట తడి పెట్టుకున్నాడు. అమ్మ కోసం ఆ బిడ్డలిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్వాతి మేనమామ నాగులు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు.