
నేటి నుంచి యాసంగి ‘రైతుబంధు’
పాస్బుక్ ఉన్న ప్రతిఒక్కరికీ లబ్ధి
ఉమ్మడి జిల్లాలో 4.57 లక్షల మంది అర్హులు
కొత్తగా లబ్ధి పొందే రైతులు
12,694 మంది.. రైతులకు తప్పిన పెట్టుబడి కష్టాలు
భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 27: రైతులందరికీ శుభవార్త.. యాసంగి రైతుబంధు నేటి నుంచే బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నది.. మంగళవారం ఎకరా లోపు రైతులకు, రెండో రోజు ఎకరా, రెండెకరాల పైన రైతులకు, ఆపైన ఇంకాస్త ఎక్కువ భూమి ఉన్న వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతుంది.. ఖమ్మం జిల్లాలో కొత్తగా 11,600 మంది, భద్రాద్రి జిల్లాలో 1,094 మంది లబ్ధిపొందనున్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా పరిష్కరించడానికి వ్యవసాయశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నది. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. పంటల పెట్టుబడికి ఇతరులపై ఆధార పడకుండా ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తున్నది.నాలుగేళ్లుగా ఏటా రెండు సీజన్లలో రైతుల ఖాతాల్లో ‘రైతుబంధు’ జమ చేస్తున్నది. ఒక్కో రైతుకు ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున నగదు అందుతున్నది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభమైంది. మంగళవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకానున్నది. నెలాఖరులోపు విడతల వారీ రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతున్నది. తొలిరోజు ఎకరా భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ కానున్నది.
నగదు జమ ఇలా..
రెండోరోజు 1-2 ఎకరాలు, మూడోరోజున 2-3 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలు, ఆ తర్వాత ఇతర రైతుల ఖాతాల్లో విడతల వారీగా నగదు జమకానున్నది. ఏదేని సాంకేతిక సమస్యలు తలెత్తితే వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు, మండల, డివిజన్ అధికారులు వెంటనే స్పందించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. జిల్లా స్థాయిలో ఒక నోడల్ అధికారి రైతుబంధు పథకం అమలును పర్యవేక్షించనున్నారు. ఈనెల వరకు నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు అందుకున్న ప్రతిఒక్కరికీ రైతుబంధు అందనున్నది. ఖమ్మం జిల్లాలో కొత్తగా 11,600 మంది, భద్రాద్రి జిల్లాలో 1,094 మంది లబ్ధిపొందనున్నారు. సాగుకు ముందే సాయం అందేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశాలివ్వడంతో వ్యవసాయశాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 3,16,385 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.362.76 కోట్లు జమకానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యాసంగిలో 1,40,931 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.214 కోట్లు నిధులు జమకానున్నాయి.
పక్కాగా ప్రక్రియ..
రైతుబంధు పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం. సాగుకు ముందే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. కొత్తగా యాసంగిలో భద్రాద్రి జిల్లాలో 1,094 మంది లబ్ధి పొందనున్నారు. ఎలాంటి సమస్య తలెత్తినా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం.