
సద్వినియోగం చేసుకుంటున్న వీధి వ్యాపారులు
8వ స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఉన్న జనాభాలో దేశంలోనే పాల్వంచకు 8స్థానం
కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 27: రోడ్ల వెంట, వీధుల వెంట వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్న చిరువ్యాపారుల ఆర్థిక స్థితిగతులను మార్చి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం స్వానిధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. చిరు, వీధి వ్యాపారులకు అండగా నిలుస్తోంది. కరోనా మహమ్మారితో చిరు, వీధి వ్యాపారుల జరగక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకొని తక్షణం వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు, వ్యాపారాలు సజావుగా నిర్వహించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం స్వానిధి ద్వారా రూ.10 వేలను అందజేయాలని నిర్ణయించాయి. దీంతో వీధి వ్యాపారులు ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీల్లో పేర్లను నమోదు చేసుకున్న వ్యాపారులందరికీ ప్రభుత్వం బ్యాంకర్ల సహాయంతో ఒక్కొక్కరికీ రూ.10 వేల రుణాలను మంజూరు చేసింది.
9,568 మందికి రుణాలు..
భద్రాద్రి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 9,568 మంది వీధి వ్యాపారులు ఉండగా.. ఒక్కొక్కరికీ రూ.10 వేలను అందించి వారి వ్యాపారాలను ఆదుకునేందుకు ప్రభుత్వం మా ర్గం సుగమం చేసింది. జిల్లా వ్యాప్తంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రిసోర్స్పర్సన్లు సర్వే చేసి మొత్తం 12,582 మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో 9,568 మందికి రుణాలను మంజూరు చేయగా మిగిలిన వారికి మరో నెలరోజుల్లో మంజూరు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 4,670 మందిని అర్హులుగా గుర్తించగా 2,922 మందికి, పాల్వంచలో 4,292 మందిని అర్హులుగా గుర్తించగా 3,569 మందికి, మణుగూరులో 1,802 మందిని అర్హులుగా గుర్తించగా 1,535 మందికి, ఇల్లెందులో 1,818 మందిని అర్హులుగా గుర్తించగా 1,542 మందికి రుణాలను మంజూరు చేశారు. రుణాలు పొందినవారు తమ కూరగాయలు, కిరాణా దుకాణల వ్యాపారాల అభివృద్ధికి వాటిని వినియోగించుకున్నారు. రుణాలు పొందినవారిలో 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో వీధి, చిరువ్యాపారులకు రుణాలను మంజూరు చేయడంలో పాల్వంచ పట్టణం దేశంలోనే 8వ స్థానం సాధించింది. ఇదే రుణాలను అందించడంలో రాష్ట్రంలో భదాద్రి జిల్లా 8వ స్థానంలో నిలిచింది. పక్కాగా సర్వే నిర్వహించి ఆర్థిక అవసరం ఉన్న వ్యాపారులందరికీ, వ్యాపారాభివృద్ధితో రాణించాలనే ఆలోచన కలిగిన వ్యాపారులందరికీ అధికారులు ఈ రుణాలను అందించారు. రూ.10 వేల రుణం తీసుకొని క్రమం తప్పకుండా చెల్లించిన వారందరికీ ఇటీవల రూ.20 వేలను సైతం వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
కరోనా సమయంలో రుణం ఆదుకున్నది..
కరోనా కాలంలో ఇబ్బంది అయింది. పెట్టుబడి పెట్టేందుందుకు అప్పులు పు ట్టలేదు. ప్రభుత్వం వీధి వ్యాపారులకు రుణం ఇస్తుందని తెలియడంతో మా ప్రాంత ఆర్పీని కలిసి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాను. రూ.10 వేల రుణం వచ్చింది. కిరాణా దుకాణంలో అవసరమైన సామాన్లు కొనుక్కొని వ్యాపారం సా గించాను. ప్రస్తుతం బాగానే నడుస్తుంది. తీసుకున్న రుణం వాయిదాల ప్రకారం కట్టడంతో వారం రోజుల క్రితం మరో రూ.20 వేల రుణం ఇచ్చారు. వ్యాపారాభివృద్ధికి ఉపయోగించుకుంటున్నా.
-కాసర్ల సత్యవతి, కిరాణా దుకాణ యజమాని
సామగ్రి కొనుగోలు చేశా..
ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేల రుణంతో నా బుట్టల వ్యాపారానికి అవసరమైన ముడిసరుకును కొనుగోలు చేసుకున్నారు. బుట్టల వ్యాపారానికి ఈ రుణం ఎంతో ఉపయోగపడింది. వాయిదాలు సక్రమంగా కడుతున్నాను. బయట ఎవరినీ అప్పులు అడగవసరం లేకుండా రుణం మంజూరైంది. వడ్డీల బాధ తప్పింది. మళ్లీ మాకు రూ.20 వేల లోన్ ఇస్తారని మా గ్రూపు లీడర్ చెప్పింది. వీటిని కూడా పెట్టుబడిగా పెట్టి వ్యాపారం పెంచుకుంటా.
-కొంటు కళావతి, బుట్టల వ్యాపారి