
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి
10,61,799 మందికి ఫస్ట్ డోస్
శ్రమించిన వైద్యారోగ్యశాఖ
డోస్ 73.11 శాతం..
‘వందశాతం’ పూర్తి చేసేందుకు కృషి
ఖమ్మం, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే టీకా ఒక్కటే శ్రీరామరక్ష’ అని తెలంగాణ సర్కారు భావించింది. శక్తి యుక్తులు ధారపోసి రాష్ట్ర ప్రజలకు అవసరమైన కొవిడ్ వ్యాక్సిన్ డోసులను సమకూర్చింది. వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పంచాయతీరాజ్, ఐసీడీఎస్, ఐకేపీ శాఖల సహకారంతో వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. వ్యాక్సినేషన్లో ఖమ్మం జిల్లాను ఇతర జిల్లాలకూ ఆదర్శంగా నిలిపారు.
ఫస్ట్ డోస్ వందశాతం పూర్తి..
పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఫస్ట్ డోస్ వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ వ్యాక్సినేషన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తొలుత జిల్లాలోని ఖమ్మం నగరం, మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలు, మండలాలకు అనుబందంగా పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం జనాభా వివరాలను సేకరించారు. ఈ లెక్కల ప్రకారం 15,59,973 జనాభాలో 18 ఏండ్లు నిండిన వారు 10,60,576 మంది ఉన్నారని గుర్తించారు. క్షేత్రస్థాయిలో అనేక ఇబ్భందులు ఎదురైనప్పటికీ, అపోహలతో పలువురు వెనుకంజ వేసినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది సహాయ సహకారాలతో వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 10,61,799 మందికి ఫస్ట్ డోస్ టీకాలు వేశారు. రెండో డోసు ఇప్పవరకు 73.11 శాతం నమోదైంది.
వైద్యారోగ్యశాఖ కఠోర శ్రమ..
జిల్లాలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వైద్యులు, వైద్యసిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకున్నారు. జనాభా ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లోనూ అదనపు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్ రోజువారీ సమీక్ష నిర్వహిస్తూ వైద్యారోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. వైద్యసిబ్బంది గ్రామగ్రామానికి వెళ్లి ఫస్ట్ డోస్ వేసుకోని వారిని గుర్తించారు. పని ప్రదేశాల్లో అప్పటికప్పుడే టీకా వేశారు. అందుకు పంచాయతీరాజ్, ఐసీడీఎస్, ఐకేపీ సిబ్బందితో పాటు ఇతర మరికొన్ని శాఖల సహాయ సహకారాలు తీసుకున్నారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి పట్టణ, గ్రామీణ ప్రాంతాలను జల్లెడ పట్టారు. అందరి కృషితో జిల్లాలో వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయింది.. ప్రస్తుతం రెండో డోస్‌పైనా అధికారులు దృష్టిసారించారు. తాజా గణాంకాల ప్రకారం 7,75,391 మందికి కొవిడ్ సెకెండ్ డోస్ అందింది.
మంత్రి పువ్వాడ అజయ్ పర్యవేక్షణ..
రెండేండ్లుగా కరోనా మహమ్మారి ఖమ్మం జిల్లాపై పంజా విసురుతూనే ఉన్నది. రెండో వేవ్‌లో ఊహించని విధంగా మరణాలు సంభవించాయి. అయినప్పటికీ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రంగంలోది దిగారు. అవసరమైన ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఇతర మందులనూ సమకూర్చడంలో ఎనలేని కృషిచేశారు. ఎప్పటికప్పుడు కలెక్టర్ వీపీ గౌతమ్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మాలతి, ఇతర అధికారులతో నిత్యం మాట్లాడుతూ అప్రమత్తం చేశారు.
సమష్టి కృషితోనే..
కరోనా ముప్పును తప్పించడానికి ప్రతిఒక్కరికీ టీకా ఇవ్వాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా జనాభాలో 18 ఏండ్లు నిండిన వారందరినీ గుర్తించి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాం. వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషి ఫలితంగానే వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయగలిగాం. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ దిశానిర్దేశంలో ఖమ్మం జిల్లాను వ్యాక్సినేషన్లో అగ్రభాగాన నిలిపాం.