
కేసీఆర్ పాలనలో కర్షకుల కష్టాలకు చెల్లు
రాష్ట్రంలో రైతులు తలెత్తుకొని జీవిస్తున్నారు
స్వరాష్ట్రంలో సాగుదారులకు స్వర్ణయుగం
చింతకాని పర్యటనలో ఎంపీ నామా నాగేశ్వరరావు
చింతకాని, డిసెంబర్ 27: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో రైతన్నలు తలెత్తుకొని జీవిస్తున్నారని, వారి మోముల్లో ఆనందం వికసిస్తోందని, రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మండలంలో ప్రొద్దుటూరు – చింతకాని గ్రామాల మధ్య రూ.3.23 కోట్లతో చేపట్టిన రహదారి విస్తరణ పనులు, నాగులవంచ సొసైటీ కార్యాలయంలో రూ.65 లక్షలతో చేపట్టిన గిడ్డంగి నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. వీటి అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రైతు సంక్షేమ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ రైతు బాంధవుడైనట్లు గుర్తుచేశారు. తెలంగాణ ఎంపీలు, మంత్రులు ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి ధాన్యం కొనుగోలుపై వినతిపత్రాలు సమర్పించిన వారు వాటిని బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా రైతులు సంఘటితంగా మారి ఇతర పంటల వైపు మళ్లి ఆదాయం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. పల్లెల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని సూచించారు. అనంతరం సొసైటీ చైర్మన్ ఆధ్వర్యంలో నామా నాగేశ్వరరావును సన్మానించారు. ఇదే ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, నాగులవంచ సొసైటీ చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు, సర్పంచ్ తుడుం రాజేశ్, ఎంపీటీసీ పెంట్యాల భారతమ్మ, ఉప సర్పంచ్ తుళ్లూరి అచ్చయ్య, నాయకులు పెంట్యాల పుల్లయ్య, మంకెన రమేశ్, కోపూరి పూర్ణయ్య, పర్చగాని తిరుపతికిశోర్, గురజాల హనుమంతరావు, బోడ్డు వెంకట్రామారావు, వంకాయలపాటి సత్యనారాయణ, వెంకటలచ్చయ్య, పర్చగాని వీరబాబు, పాపినేని రంగారావు, కొల్లి బాబు, బొగ్గారపు శ్రీను, సోమా నాగేశ్వరరావు, తుడుం కృష్ణ, సిలివేరు సైదులు, సర్పంచ్‌లు బండి సుభద్ర, చాట్ల సురేశ్, కాండ్ర పిచ్చయ్య, ఆలస్యం నాగమణి, డైరెక్టర్లు, తహసీల్దార్ తిరుమలాచారి, ఎంపీడీవో రవికుమార్, డీసీవో విజయకుమారి, సీఈవో శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.