
వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ అభినందనీయం
ఇదే స్ఫూర్తితో రెండో డోస్ వ్యాక్సినేషనూ పూర్తి చేయాలి
వైద్యారోగ్యశాఖ సిబ్బంది అభినందన సభలో మంత్రి అజయ్‌కుమార్
రెండో డోసూ పూర్తి చేయాలి: కలెక్టర్ గౌతమ్
మామిళ్లగూడెం, డిసెంబర్ 27: ఖమ్మం జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసును వందశాతం పూర్తి చేసేందుకు విశేష సేవలందించిన వైద్య, అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది సేవలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. జిల్లాలో ఫస్ట్ డోస్ నూరుశాతం పూర్తయిన సందర్భంగా సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 10,61,799 మందికి మొదటి డోసు అందించి వంద శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసుకున్నామని, 73 శాతంతో రెండో డోసు పూర్తి చేసుకున్నామని అన్నారు. ఇదే స్ఫూర్తితో త్వరలోనే రెండో డోసునూ వంద శాతం పూర్తి చేయాలని మంత్రి సూచించారు. తాను కూడా రెండుసార్లు కొవిడ్ బారిన పడినప్పటికీ మనోధైర్యంతో వైరస్‌ను ఎదురొని ప్రజలకు సేవలందించగలిగానని మంత్రి గుర్తుచేశారు. దేశంలోనే పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక శాతం మందికి టీకాలు వేసి ముందంజలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. ప్రజలు పని చేసే చోటికే వెళ్లి టీకా అందించడం ద్వారా జిల్లాలో వంద శాతం మొదటి డోసు పూర్తయిందని అన్నారు.
అనంతనం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ అనుబంధ శాఖల అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకోగలిగామన్నారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోసు వంద శాతం పూర్తి చేసుకున్న స్ఫూర్తితో అతి త్వరలోనే రెండో డోసును సైతం వంద శాతం పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే 73 శాతం రెండో డోసు పూర్తయిందన్నారు. ప్రోగ్రాం అధికారి, వ్యాక్సినేషన్ కో ఆర్డినేటర్ డాక్టర్ సైదులు, కూసుమంచి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు, బోదులబంద పీహెచ్సీ ఎంవో డాక్టర్ రాజేశ్వర్, చెన్నూరు పీహెచ్సీ ఎంవో డాక్టర్ శ్రవణ్‌లను మంత్రి సతరించి ప్రశంసాపత్రాలను అందజేశారు. మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, మండల ప్రత్యేక అధికారులు, ఎంవోలు పాల్గొన్నారు.