
ప్రభుత్వ బడుల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
కార్పొరేట్‌ను తలపిస్తున్న సర్కారు పాఠశాలలు
నాణ్యమైన విద్యతోపాటు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందజేత
ఈ ఏడాది 4,321 మంది విద్యార్థులు చేరిక
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 27;తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రైవేటు దోపిడీకి చెక్ పెడుతూ.. కార్పొరేట్‌కు దీటుగా సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దింది. గతంలో సమస్యలతో సతమతమైన పాఠశాలలు.. నేడు సకల సౌకర్యాలకు నిలయంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ పాఠశాల విద్యపై దృష్టి సారించడంతో సర్కారు విద్యకు మహర్దశ పట్టింది. ప్రభుత్వ పాఠశాలల దశ మారిపోయింది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతోపాటు.. ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంలు, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నది. దీంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను విడిచి ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ పొందినవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు 4,321 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.
తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడిలో సకల సౌకర్యాలు సమకూర్చుతున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంలు అందజేస్తున్నది. అంతేకాదు, వారికి పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నది. ప్రభుత్వ బడుల్లో రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన విద్య అందుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మార్పు వైపు అడుగేస్తున్నారు. ప్రైవేటు ఫీజుల దోపిడీకి చెక్ పెడుతూ ప్రభుత్వ విద్యనందించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ బడులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయి. విద్యార్థులు ‘ప్రైవేటు’ బడిని వీడి.. ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 4,321 మంది విద్యార్థులు ‘ప్రైవేటుకు టాటా చెప్పి& ప్రభుత్వ బడిలో చేరారు. విద్యార్థుల చేరికతో సర్కారు పాఠశాలలు కళకళలాడనున్నాయి.
2014 సంవత్సరానికి ముందు విద్యార్థుల్లేక బోసిపోయిన పాఠశాలలు.. సమస్యలతో సతమతమయ్యాయి. కాని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సర్కారు విద్యను గాడిలో పెట్టింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. సర్కారు విద్యను బలోపేతం చేసేందుకు వివిధ పథకాలను అమలు చేశారు. భారీగా నిధులు కేటాయిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నది. అంతేకాదు, ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను తమ పిల్లలుగా భావించి విద్యబోధన చేస్తున్నారు.
కడుపు నిండా భోజనం
విద్యార్థుల అర్ధాకలి చదువులకు కాలం చెల్లింది. దొడ్డు బియ్యంతో విద్యార్థులు సరిగా అన్నం తినలేకపోతున్నారని సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నది. పోషకాలతో కూడిన ఆహారం అందజేస్తుండడంతో విద్యార్థులు సంబురంగా సర్కారు బడికి వస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పాఠశాలల్లో సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నది. ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడిని తీర్చిదిద్దుతున్నది.
నాణ్యమైన బోధన..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అసామాన్య ఫలితాలు సాధించడంతో ప్రైవేట్ పాఠశాలలకు పంపే విద్యార్థుల తల్లిదండ్రుల్లో మార్పు మొదలైంది. విద్యార్థులకు అవసరమైన పంచ శక్తులు ఉచిత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం, ఆటస్థలం, నాణ్యమైన బోధన.. ఇలా ఎక్కడా రాజీపడకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటితో విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులవుతున్నారు.
పెరిగిన విద్యార్థులు..
కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతుల పేరుతో రూ.వేలల్లో ఫీజులు వసూలు చేశాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు టీవీ పాఠాలను విజయవంతంగా నిర్వహించాయి. ఆన్లైన్ పాఠాల్లోనూ ప్రభుత్వ విద్యార్థులపై పర్యవేక్షణ పెంచారు. దీంతో ప్రైవేట్ నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు క్యూ కట్టారు. 4,321 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 2021-22 విద్యాసంవత్సరంలో 10,966 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
నేను చదువుకున్న బడిలోనే చదువు చెప్పించాలని..
చిన్న తనంలో మా నాన్న ఎం.ఏ రబ్ ఖమ్మం రిక్కా బజార్ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పని చేశారు. ఆ సమయంలో నేను అదే స్కూల్లో చదువుకున్నాను. నా పాఠశాల విద్యాభ్యాసం మొత్తం ఇక్కడే జరిగింది. మేము చదువుకున్న పాఠశాలలోనే మా పాపను చదివించాలనేది నా కోరిక. అందుకే 5వ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న మా పాప మొహసినా తబస్సుమ్‌ను 6వ తరగతి ప్రభుత్వ బడిలో చేర్చాను. మేము చదివిన బడిలోనే చేర్పించడం సంతోషంగా ఉంది.
-ముస్తామ్ హసన్, ఖమ్మం
అడ్మిషన్లు బాగా పెరిగాయి…
2021-22 విద్యాసంవత్సరానికి ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూల్స్‌లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ విద్యాసంవత్సరం 4321 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చి చేరారు. కొవిడ్ సమయంలో విద్యార్థులకు నష్టం జరగకుండా టీవీ పాఠాలు బోధించడంతో పాటు ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేశారు. సర్కార్ బడుల్లో నాణ్యమైన ఉచిత విద్య అందుతుండడంతో పాటు ఉచిత పుస్తకాలు, పోషక విలువలతో కూడిన మద్యాహ్న భోజనం కూడా అందిస్తుండటంతో విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. -యాదయ్య, డీఈఓ