
35 ఏళ్లుగా అజ్ఞాత జీవితం
మావోస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి..
ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది
ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్
ఖమ్మం ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మావోయిస్టులు అజ్ఞాతం వీడి జన జీవన స్రవంతిలో కలవాలని, లొంగిపోయిన వారికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందేలా చూస్తామని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ పిలుపునిచ్చారు. మూడున్నర దశబ్ధ్దాలకు పైగా మావోయిస్టు పార్టీలో కొనసాగిన యెక్కంటి సీతారామిరెడ్డి అలియాస్ నాగన్న అనారోగ్య కారణాల రీత్యా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలోని పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాలకు చెందిన యెక్కంటి సీతారామిరెడ్డి మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1981లో పీపుల్స్‌వార్ గ్రూప్‌లో చేరాడు. పీపుల్స్‌వార్ భద్రాచలం దళంలో సభ్యుడిగా చేరి దళ కమాండర్ స్థాయికి ఎదిగాడు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పార్టీ విస్తరణకు కృషి చేశాడు. 1985లో పోలీసులకు పట్టుబడి రెండేళ్లు జైలు జీవితం అనుభవించాడు. బెయిల్‌పై బయటకు వచ్చాడు. కొన్నాళ్లు కుటుంబంతో కలిసి ఉండి తర్వాత తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఒడిశాలోని మల్కన్గరిలో కీలకంగా పనిచేశాడు. ఆంధ్రా- ఒడిశా బార్డర్ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. లొంగిపోయే ముందు వరకు ఇదే ప్రాంతంలో మావోయిస్టులకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించాడు. పార్టీలో నాగన్న, శివన్న, అప్పన్న, ఐతూ, సలీం అనే మారుపేర్లతో కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. కొన్నాళ్ల నుంచి చర్మ, కిడ్నీ, కీళ్ల సమస్యలతో పాటు మధుమేహంతో బాధపడుతున్న ఆయన జన జీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టుకు రూ.5 లక్షలు అందజేస్తామన్నారు. తక్షణ సాయం రూ.10 వేలు అందించినట్లు సీపీ తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ స్నేహా మెహారా పాల్గొన్నారు.