
పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలి
మొక్కల పెంపకం చేపట్టాలి
స్తూప సందర్శనలో కలెక్టర్ వీపీ గౌతమ్
నేలకొండపల్లి, ఆగస్టు 27: నేలకొండపల్లిలోని బౌద్ధస్తూపానికి చారిత్రక విశిష్టత ఉన్నదని, ఈ ప్రాంతాన్ని ఎక్కువమంది పర్యాటకులు వీక్షించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన బౌద్ధస్తూపాన్ని సందర్శించి అధికారులకు సలహాలు, సూచనలిచ్చారు. స్తూపం ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగింపజేయాలన్నారు. నేలకొండపల్లిలోని బౌద్ధస్తూపం, భక్త రామదాసు ధ్యాన మందిరం, పాలేరు రిజర్వాయర్, కూసుమంచిలోని పూరాతన శివాలయాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంగా ఎలా ఉంటుందనే విషయంపై జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తితో చర్చించారు. దీనిపై జిల్లా పర్యాటకశాఖ అధికారి మాట్లాడుతూ.. బౌద్ధస్తూపం పర్యాటకాభివృద్ధికి రూ.1.36 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. తర్వాత రూ.75 లక్షల నిధులు విడుదలయ్యాయన్నారు. ఈ నిధులతో ప్రత్యేక గదులు, రెస్టారెంట్ నిర్మించనున్నట్లు తెలిపారు. స్తూపం పురావస్తుశాఖ పరిధిలో ఉందని, మరికొంత ప్రదేశం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉందన్నారు. స్తూపం నుంచి మెయిన్ రోడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటిస్తామని ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం స్తూపం వద్ద కలెక్టర్ మొక్క నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉన్నం బ్రహ్మయ్య, మండల ప్రత్యేక అధికారి విరూపాక్షి, నయాబ్ తహసీల్దార్ వనజ, ఏపీవో సునీత పాల్గొన్నారు.
పనులు చేయకపోతే కాంట్రాక్టర్‌ను మార్చండి
నేలకొండపల్లి, ఆగస్టు 27: మండలంలోని బాలసముద్రం చెరువును శుక్రవారం కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా ఉండడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే కంట్రాక్టర్‌ను మార్చాలని అధికారులను ఆదేశించారు. పనులపై ఇరిగేషన్ ఈఈ సమ్మిరెడ్డిని ఆరా తీశారు. చెరువు కట్టపై మొక్కలు నాటించాలని ఎంపీడీవో చంద్రశేఖర్‌ను ఆదేశించారు.