
దరఖాస్తులు అందజేసిన 30 మంది టీచర్లు
ఆప్షన్ల నమోదుకు నేటి వరకు అవకాశం
28, 29 తేదీల్లో కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు
ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 26: జిల్లా విద్యాశాఖ పరిధిలోని నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం విభజన ప్రక్రియలో ఖమ్మం జిల్లాకు కేటాయించిన పోస్టుల సంఖ్యకు సమానంగా ఖాళీల జాబితాను విడుదల చేశారు. అలాట్మెంట్ అయిన పోస్టులకు అనుగుణంగా ఖాళీలను నోటిఫై చేశారు. పోస్టు కేటగిరీ వారీగా స్కూళ్ల ఖాళీలను లోకల్‌బాడీ, ప్రభుత్వ పరంగా వేర్వేరుగా పొందుపరుస్తూ వెబ్సైట్లో ఉంచారు. ఖమ్మం జిల్లాకు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల నుంచి 594 మందికి కేటాయించగా వారందరూ రిపోర్ట్ చేశారు.
ఆప్షన్స్ అందజేసిన 30 మంది టీచర్లు..
పనిచేస్తున్న జిల్లా నుంచి ఇతర జిల్లాలకు కేటాయించిన టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు సంబంధించిన ప్రక్రియను వేగంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయుల నుంచి ఈ నెల 26, 27 తేదీల వరకు ఆప్షన్ ఫారాలను డీఈవో కార్యాలయ సిబ్బంది స్వీకరిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఆప్షన్ ఫారాల్లో టీచర్లు ప్రాధాన్య క్రమంలో స్కూళ్లను ఎంపిక చేసి డీఈవో కార్యాలయంలో అందజేయాలి. ఆదివారం 30 మంది టీచర్లు తమ ప్రాధాన్యాన్ని తెలిపే ఆప్షన్ ఫారాలను అందజేసినట్లు డీఈవో యాదయ్య తెలిపారు. సోమవారం వరకు ఆప్షన్ ఫారాలు అందించేందుకు అవకాశం ఉంది.
ఖాళీల జాబితాలో విద్యార్థుల సంఖ్య కూడా..
కేటగిరీల వారీగా ఖాళీల జాబితాను విడుదల చేశారు. తొలుత టీచర్లు లేని స్కూళ్లకు ప్రాధాన్యం కల్పిస్తూ ఖాళీల జాబితాను విడుదల చేశారు. 594 మంది టీచర్లను విభజన ప్రక్రియలో జిల్లాకు కేటాయించగా.. 594 పోస్టులనే ఖాళీల జాబితాలో చూపించారు. జాబితాలో యూడైస్ కోడ్, స్కూల్ పేరు, మండలం, మేనేజ్మెంట్, మీడియం, పోస్టు కేటగిరీ, విద్యార్థుల సంఖ్య వంటివి కూడా పొందుపర్చారు. ఆయా పాఠశాలలకు అనుమతి ఉన్న పోస్టులు, వర్కింగ్‌లో ఉన్న పోస్టులు, ఖాళీ పోస్టుల వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం, లోకల్ బాడీల వారీగా ఖాళీల జాబితాను సైతం తయారు చేశారు. సబ్జెక్టుల వారీగా ఉన్న ఖాళీలతో జాబితా రూపొందించారు.
కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు..
జిల్లాకు కేటాయించిన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఈ నెల 28, 29 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నగరంలోని డైట్ కళాశాల లేదా జిల్లా పరిషత్‌లో ప్రక్రియను నిర్వహించేందుకు ఎంపిక చేశారు. సోమవారం కలెక్టర్ తీసుకునే నిర్ణయం ఆధారంగా వేదికపై స్పష్టత రానుంది. ఉపాధ్యాయుల నుంచి స్వీకరించిన ఆప్షన్స్ ఫారాలకు అనుగుణంగా సీనియారిటీ ప్రాతిపదికన పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఇం దుకు సంబంధించిన ప్రక్రియపై ఆదివారం సాయంత్రం తన కార్యాలయ సిబ్బందికి డీఈవో యాదయ్య సూచనలు చేశారు.