
వీజే సన్నీ… ఖమ్మం సత్తా చూపావు..
బిగ్‌బాస్ టైటిల్ విజేతకు అభినందనల వెల్లువ
ఖమ్మం కల్చరల్, డిసెంబర్ 26 : ఒక ప్రముఖ చానల్లో ప్రసారమైన ప్రఖ్యాత రియాల్టీ షో బిగ్‌బాస్. ఆ షో ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసిన ఆ కుర్రోడు.. ఆ హౌజ్‌లో వంద రోజులకు పైగా ఉండడం, ఆటల్లో గెలవడం జరిగాయి. ఉత్కంఠ నడుమ ప్రేక్షకుల ఓట్లతో మన ఖమ్మం కుర్రోడు వీజే సన్నీ (అరుణ్) బిగ్‌బాస్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఈ మేరకు ఆదివారం లకారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన అభినందన సభలో పలువురు ప్రముఖులు అతణ్ని అభినందించారు. కార్పొరేటర్ పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఖమ్మం ముందుంటుందని సన్నీ మరోసాని నిరూపించాడని అన్నారు. ఆటైనా, పాటైనా, ఇతర ఏ కళ అయినా, ప్రతిభ అయినా ఖమ్మం యువతదే పైచేయి అనడానికి సన్నీనే నిదర్శనమన్నారు. ప్రతి రంగంలో యువత తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి ఖమ్మం కీర్తిని మరింత పెంచాలని అభిలషించారు. ఈ సందర్భంగా సన్నీని శాలువాలతో సత్కరించారు. విజేత సన్నీ మాట్లాడుతూ ఖమ్మం ప్రజలు వెన్నంటి ఉంటే ఏదైనా సాధిస్తానన్నారు. ఖమ్మం ప్రజల అభిమానంతోనే ఈ టైటిల్‌ను గెల్చుకున్నానని, మరిన్ని విజయాలు సాధించి ఖమ్మం కీర్తి ప్రతిష్టలను పెంచుతానని అన్నారు. కాగా, సన్నీని చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘మచ్చా’ అంటూ కేకలు వేశారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్లు, జీవీ మాల్ యాజమాన్య బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు నృత్యాలు, కామెడీ స్కిట్స్ అలరించాయి.