
18 మండలాల్లోని 2.5 లక్షల ఎకరాల్లో సాగు
లక్షలాది మందికి జీవనాధారం
వేసవిలో 330 చెరువులకు ప్రాణాధారం
పాలేరు ఆధారంగా 100 చెరువుల్లో మత్స్య సంపద
కూసుమంచి, ఆగస్టు 26 : పాలేరు రిజర్వాయర్ మూడు జిల్లాలకు ఆయువుపట్టు.. ఆయకట్టుకు ఊపిరి.. లక్షలాది మందికి జీవనాధారం.. మత్స్య సంపదకు ప్రాణాధారం.. వందలాది చెరువులకు జీవం.. సాగర్ ఎడమ కాలువ పరిధిలోని పాలేరు రిజర్వాయర్.. ఖమ్మం జిల్లాలోని 2.5 లక్షల ఎకరాల మాగాణి, కృష్ణా జిల్లా మూడోజోన్ 2.5 లక్షల ఎకరాల ఆరుతడి పంటలకు నీరందిస్తున్నది. పాలేరు కింద జిల్లాల్లోని 18 మండలాల్లో సుమారు 6 లక్షల మంది రైతులకు సాగు నీరందుతున్నది. రిజర్వాయర్ కేంద్రంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌లోని 40 మండలాలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలం అందుతున్నది. ఖమ్మం జిల్లాలో గ్రామాల్లోని 330 చెరువులకు పాలేరు నుంచి నీరందిస్తున్నది. జిల్లాలోని సుమారు 100కు పైగా చెరువుల్లో చేపల పెంపకంతో వేలాది మంది మత్స్యకారులకు జీవనోపాధి దొరుకుతున్నది. కర్షకుల పాలిట కల్పతరువుగా నిలుస్తున్న పాలేరు రిజర్వాయర్‌పై ‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక కథనం.
పాలేరు రిజర్వాయర్‌తో ఏటా ఆయకట్టు సాగు సస్యశ్యామలంగా మారుతున్నది. రిజర్వాయర్ సాగర్ ఎడమ కాలువ వద్ద 139 కి.మీ నాయకన్‌గూడెం ఇన్‌ఫాల్ ద్వారా జిల్లాలోకి ప్రవేశిస్తున్నది. సాగర్ జలాలు ఎడమ కాలువ రెండో జోన్ ద్వారా కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, అర్బన్, చింతకాని, కొణిజర్ల, వైరా, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, తల్లాడ, కల్లూరు, వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో లక్షలాది మంది రైతులకు వరప్రదాయినిగా నిలుస్తున్నది. రెండు పంటలకూ సమృద్ధిగా నీరందిస్తూ లక్షలాది మంది రైతులకు అండగా ఉంటున్నది. మూడు జిల్లాల్లో సుమారు 15 లక్షల మందికి తాగునీరందిస్తున్నది. 2.5లక్షల ఎకరాల్లో ఖమ్మం జిల్లాలోని మాగాణి, కృష్ణా జిల్లాలో ఖమ్మం జిల్లా సరిహద్దు కల్లూరు నుంచి నూజివీడు వరకు మూడో జోన్ కింద ఆరుతడి పంటలకు సుమారు 3 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తున్నది.
ఇంటింటికీ మిషన్ భగీరథ..
ఖమ్మం జిల్లాలోని సుమారు 15 మండలాలకు, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 25 మండలాలకు తాగునీరందించే మిషన్ భగీరథకు ఇన్‌టేక్ వెల్స్ పాలేరు రిజర్వాయర్ వద్దనే నిర్మించారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించిన పాలేరు ఔట్‌ఫాల్ ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి నాయకన్‌గూడెంలో పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా సరిహద్దు మాదిరిపురంలో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్‌టేక్‌వెల్ నిర్మించారు. నిత్యం శుద్ధిచేసిన తాగునీటిని ప్రజలకు అందించడానికి పాలేరులో ఇన్‌టేక్ వెల్ ద్వారా నీటిని తీసుకొని వాడుకొంటున్నారు. సుమారు 6 లక్షల మందికి తాగునీటిని పాలేరు నుంచే అందిస్తున్నారు. ఈ ఏడాది యాసంగికి ఈ నెల 5వ తేదీన పాలేరు నుంచి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నీటిని వదిలారు.
కరువు నేలకు సాగు నీరందించిన భక్తరామదాసు ప్రాజెక్టు..
పాలేరు రిజర్వాయర్ పక్కనే ఉన్నా.. నిత్యం కరువుతో అల్లాడే తిరుమలాయపాలెం, కూసుమంచి, ఇతర మండలాల్లోని పలు గ్రామాలకు సాగు నీటి కోసం తెలంగాణ సర్కారు ఐదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో భక్తరామదాసు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుంది. సుమారు రూ.100 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం కింద పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మహబూబాబాద్ జిల్లాలోని ఒక మండలంలో కొంత వరకు.. 72 వేల ఎకరాలకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా సాగు నీరందిస్తున్నారు. భక్తరామదాసు ప్రాజెక్టుతో కరువు ప్రాంతం సుభిక్షంగా మారింది.
వేలాది మంది మత్య్సకారులకు జీవనాధారం..
పాలేరు రిజర్వాయర్ పరిధిలో 1,500 మత్స్యకారుల కుటుంబాలు చేపల వేటతో జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం 13 లక్షల చేపపిల్లలను ఉచితంగా సరఫరా చేయడంతో మత్స్యకారులకు ఖర్చులు తగ్గాయి. జిల్లాలోని 330 చెరువులు రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉండడంతో వేసవిలో తాగునీటి కోసం సాగర్ జలాలను పాలేరు నుంచే నింపుతారు. వర్షాకాలంలో చెరువులు నిండిన తర్వాత గ్రామాల్లోని మత్స్యకారులు సహకార సంఘాల ద్వారా చేపలు పోసుకొని జీవనం సాగిస్తున్నారు. వేలాది మంది మత్స్యకారులకు పాలేరు జీవనాధారంగా మారింది. వివిధ సహకార సంఘాల ద్వారా సుమారు 5 వేల మంది మత్స్య కారులున్నారు. పాలేరు కింద చెరువుమాధారం, బాలసముద్రం, వైరా, లంకాసాగర్, సత్తుపల్లి, కల్లూరు వంటి పెద్ద చెరువులున్నాయి. వాటికి పాలేరు నుంచే నీరందిస్తారు. సుమారు 500 టన్నుల వరకు చేపల ఉత్పత్తి జరుగుతున్నది. సుమారు 100 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి.
పర్యాటక కేంద్రంగా..
పాలేరు రిజర్వాయర్ ప్రాంతంలో సాయం సంధ్య వేళలో ప్రకృతి అందాలకు కొదవ లేదు. ఖమ్మానికి 25 కి.మీ దూరంలో ఉండడంతో సెలవులు, పండుగల రోజుల్లో పర్యాటకులు వస్తారు. పాలేరులో చిన్న పిల్లలకు పార్కు ఏర్పాటు చేశారు. కానీ, ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. 16 సీట్ల బోట్, చిన్న సీట్ల మరబోటు ఉంది. పాలేరు పక్కనే మినీహైడెల్ విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఉంది. పాలేరు అలుగుల వద్ద కట్టడాలు.. ఎత్తైన ఆనకట్ట పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. సాయంత్రం అలల తాకిడి పర్యాటకుల మదిని దోచేస్తుంది.