
50 మంది నిరుపేద విద్యార్థులకు రూ.5 లక్షల సెల్ఫోన్లు
పంపిణీ చేసిన ఎమ్మెల్యే సండ్ర, ఖమ్మం కలెక్టర్ గౌతమ్
కల్లూరు, ఆగస్టు 26: డిజిటల్ క్లాసులు వినేందుకు అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద విద్యార్థులకు ‘తోపుడుబండి’ ఫౌండేషన్ బాధ్యుడు సాధిక్ అలీ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 50 మంది నిరుపేద విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు వినేందుకు రూ.5 లక్షల విలువైన సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ సమకూర్చారు. వీటిని కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ కల్లూరు గ్రామానికి చెందిన ‘తోపుడుబండి’ సాధిక్‌అలీ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమైనవని అన్నారు. ఆయన సతీమణి వరంగల్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి అయినప్పటికీ ప్రజలకు సేవచేసేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని అన్నారు. కల్లూరు మండలంతోపాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తోపుడుబండి ద్వారా సాధిక్ అలీ 1000 కిలోమీటర్లు నడిచి పిల్లలకు పుస్తకాలను అందించడం, వారిని చదివించడం ఆయన మంచి ఆశయానికి నిదర్శనమన్నారు. అనంతరం సాధిక్అలీని సత్కరించారు. ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ మంగీలాల్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఐసీడీఎస్ ఏసీడీపీవో అంజుం, జడ్పీటీసీ అజయ్‌బాబు, సర్పంచ్ లక్కినేని నీరజ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామారావు, రైతుబంధు సమితి బాధ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ లక్ష్మణరావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్ పాల్గొన్నారు.