భద్రాచలం, ఫిబ్రవరి 14 : భద్రాచలం పోలీసుల తనిఖీలో సోమవారం రూ.26.40 లక్షల గంజాయి పట్టుబడింది. ఆ వివరాలను ఏఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. బ్రిడ్జి సెంటర్లో ఉన్న అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద ఎస్సై మధుప్రసాద్ సోమవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు కార్లు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా 132 కిలోల గంజాయి పట్టుబడింది.
కార్లలో ఉన్నవారిని విచారించగా బీదర్‌కు చెందిన సంజీవ్‌కుమార్, అజయ్ దేవరాయ్, గణపతి చౌహన్, సంగేష్ జాదవ్, బాన్సి బిక్కు రాథోడ్‌లుగా గుర్తించామని తెలిపారు. వీరు ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి కర్ణాటకలోని బీదర్‌లో అమ్మేందుకు రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.26.40 లక్షలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. సీఐ నాగరాజ్‌రెడ్డి కేసు నమోదు చేసి రెండు కార్లను స్వాధీనం చేసుకొని, ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారని వివరించారు.