
హిమాన్షు జోలికి వస్తే ఊరుకోం
ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి.. సహనంతో ఉంటున్నాం..
బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష ఎందుకో చెప్పాలి
కేంద్రం 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకా?
పీఆర్సీ ప్రకటించనందుకా.. ?
బీజేపీ అండతో తీన్మార్ మల్లన్న అరాచకాలు
ధాన్యం కొనుగోళ్లపై అసత్య ప్రచారం చేస్తున్న కేంద్రం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో రాజకీయాలను కలుషితం చేసింది, భ్రష్టుపట్టిస్తున్నది బీజేపీయేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. రైతు వ్యతిరేక వైఖరిని విడనాడాలని డిమాండ్ చేశారు. రాజకీయ విధానాలపై పోరాటం చేయకుండా వ్యక్తిగత విమర్శలతో దిగజారుడు రాజకీయాలు చేయడం, కుటుంబసభ్యులను కించపరిచేలా వ్యాఖ్యానించే వ్యక్తులకు పార్టీ కండువాలు కప్పడం ఆ పార్టీకే చెల్లిందని విమర్శించారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు. కానీ వ్యక్తిగత విమర్శలు చేసేవారికి అండదండలు అందించడం దారుణమన్నారు. రాష్ట్ర మంత్రులు మూడు రోజులు ఢిల్లీలో ఉన్నా కనీసం స్పందించకపోవడం రైతు సమస్యల పట్ల కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుమారుడు హిమాన్ష్‌పై బీజేపీ అండదండలతో తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్య లు, అరాచకాలను చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజకీయ విధానాల గురించి మాట్లాడాల్సిన బీజేపీ.. తన కార్యకర్తలతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయిస్తోందని అన్నారు. ఇలాంటి చర్యలతో తమ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు.
‘బండి’ దీక్ష ఎందుకు?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష ఎందుకు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి అజయ్ డిమాండ్ చేశారు. హామీ ప్రకారం 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా కేంద్రం ప్రభుత్వం మాటతప్పినందుకో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ పీఆర్సీ ప్రకటించనందుకో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 1.39 లక్షలు ఉద్యోగాలు భర్తీచేసిందని, లెక్కలతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తూ ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో లెక్కలు చెప్పగలదా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగిన నాయకుడిగా, ప్రజాసమస్యలపై తక్షణం స్పందించే నేతగా మంత్రి కేటీఆర్‌కు ఎంతో మంచిపేరు ఉందన్నారు. తీన్మార్ మల్లన్న వంటి నేతలు చేసే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మంత్రి కాలిగోటికి కూడా సరిపోవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టారీతిన మాట్లాడే బండి సంజయ్, ఎంపీ అరవింద్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయరని, ధాన్యం కొనుగోలుపై ఎందుకు నోరుమెదపరని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారం: తాతా మధు
ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించకుండా బీజేపీ సర్కారు అసంబద్ధంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. తీన్మార్ మల్లన్న వంటి వ్యక్తులను ఉసిగొల్పి సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ నాయకులపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ విధానం ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ కుటుంబాల వ్యవహారాల్లో చొరబడితే టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించి తీరుతారని ఆయన స్పష్టం చేశారు. మరో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజకీయ అక్కసుతో హిమాన్షుపై వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. హిమాన్ష్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్న వ్యక్తులకు ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, ఖమర్, పగడాల నాగరాజు, చింతనిప్పు కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.