
కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 25: జాతీయస్థాయి శిల్ప కళా ప్రదర్శనలకు కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్ వేదికైంది. సింగరేణి సీఎస్ఆర్ నిధులతో నిర్వహించే ఈ ప్రదర్శన వచ్చే నెల 2 వరకు కొనసాగనుంది. పరిసర ప్రాంతాల ప్రజలతోపాటు విద్యార్థులు వీటిని తిలకించేందుకు అవకాశం కల్పించారు. హైదరాబాద్‌లోని ఆర్ట్ కల్చర్ ఫౌండేషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినోద్‌కుమార్ అగర్వాల్ ఆధ్వర్యంలో 10 మంది శిల్ప కళాకారులతో నిర్వహించే ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలోనే మొదటిసారిగా కొత్తగూడెంలో నిర్వహించే ఆర్ట్ అండ్ కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యాధునిక టెక్నాలజీతో జీవకళ ఉట్టిపడేలా శిల్పాలను తయారు చేసేందుకు రాజస్థాన్ నుంచి 10 శాండ్స్టోన్లను తెప్పించారు. ఆర్ట్ అండ్ కల్చర్‌లో డాక్టరేట్ పొందిన హైదరాబాద్‌కు చెందిన స్నేహలత ప్రసాద్ పర్యవేక్షణలో జరిగే ఈ ప్రదర్శనకు హర్యానాకు చెందిన హృదయ్ కౌశల్, దినేశ్ సేవాల్, ఢిల్లీకి చెందిన మహిపాల్, సయ్యాద్ జావీద్, సతీశ్‌కుమార్ చౌహాన్, ఒడిశాకు చెందిన రవీందర్ పట్నాయక్, చెన్నైకి చెందిన శివకుమార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్‌కుమార్, రాజస్థాన్‌కు చెందిన లోకేశ్ రాత్రింబవళ్లు ఈ శిల్పాలను తయారు చేయనున్నారు. సింగరేణి జీఎం పర్సనల్ బసవయ్య ఆధ్వర్యంలో సీనియర్ పీవో గట్టుస్వామి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సంప్రదాయాలు ఉట్టిపడేలా..
తెలంగాణ రాష్ర్టానికి మణిహారమైన సింగరేణి ప్రాంతమైన కొత్తగూడెంలో శిల్పకళా ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రంలోనే మొదటిసారి. సింగరేణి సంస్థ అవకాశం కల్పించిన ఈ కళా ప్రదర్శనలో సింగరేణి జీవనశైలి, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా శిల్పాలు తయారు చేస్తాం.
-స్నేహలత ప్రసాద్, టీమ్ ఇన్చార్జి