
టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా లేక అసత్య ప్రచారం..
హిమాన్షుపై తీన్మార్ మల్లన్న బాడీ షేమింగ్
ఆయన వైఖరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు
పిల్లలు, కుటుంబ సభ్యులపై విద్వేషపు పోస్టులు తగునా..?
మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా నిలిచిన జనం
ఖమ్మం, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):బీజేపే నేతల దిగజారుడు రాజకీయాలపై జనాగ్రహం వ్యక్తమవుతున్నది.. టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేక ‘కమలం’ నేతలు విద్వేషపు వ్యాఖ్యలు చేస్తున్నారు.. రాజకీయ విలువలకు సమాధి కట్టి పిల్లలు, కుటుంబ సభ్యులను మానసికంగా వేదనకు గురిచేస్తున్నారు.. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక నీచమైన పనులు చేస్తున్నారు.. చిల్లర రాజకీయాలు చేస్తూ జనం చేత ఛీ కొట్టించుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న యూట్యూబ్ చానల్లో పెట్టిన అభ్యంతరకర పోల్‌పై ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి పోల్ నిర్వహించే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. బీజేపీ అండతో అరాచకాలు సృష్టిస్తున్న మల్లన్నపై శనివారం టీఆర్ఎస్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బీజేపీ దిగజారుడు రాజకీయాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విధానాలపై విమర్శలు చేయాల్సిన బాధ్యతాయుతమైన బీజేపీ.. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేసిన నీతిబాహ్య వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ చానల్ ద్వారా అభ్యంతరకర పోల్ నిర్వహించడంపై మండిపడుతున్నారు. హిమాన్షుపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం ఖమ్మం టూటౌన్ పోలీస్‌సేష్టన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్ కుమారుడిపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీశాయని పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేని హిమాన్షుపై నీతిమాలిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సోషల్ మీడియా ముసుగులో మల్లన్న చేస్తున్న అనైతిక వ్యాఖ్యలు, అరాచకాలను కట్టడి చేయాలని కోరారు. చింతపండు నవీన్ వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మండిపడ్డారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగొద్దని హితవు పలికారు.
పిల్లలు, కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వంలో ఉండడంతో సహనంతో ఉన్నామని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉండేవని హెచ్చరించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం కోల్పోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌కు అండగా ఉంటామని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ మనోభావాలు దెబ్బతినడానికి కారణమైన తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిమాన్షుపై వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. బీజేపీ సంస్కార లేని మాటలతో సమాజాన్ని చెడగొడుతున్నదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. పిల్లలపై ప్రేలాపనలు పేలడం బీజేపీకి ఎవరు నేర్పిన సిద్ధాంతామని ప్రశ్నించారు. హిమాన్షుపై మల్లన్న వ్యాఖ్యలను రైతులు, టీఆర్ఎస్ విద్యార్థి, యువజన, రైతు, మహిళా, కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి.