
విద్యార్థులందరూ హాజరయ్యేలా చూడాలి
విద్యార్థులతో పనులు చేయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు
అందరూ కొవిడ్ టీకా తీసుకోవాలి
విద్యాశాఖ సమీక్షలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
స్కూల్స్‌లో పల్స్ ఆక్సీమీటర్లు, థర్మామీటర్లు అందుబాటులో ఉండాలి : కలెక్టర్
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 25: జిల్లాలో విద్యా వ్యవస్థను పూర్వ స్థితిలో కొనసాగించేందుకు విద్యాసంస్థల్లో అవసరమైన ఏర్పాట్లను ఈ నెల 30లోగా పూర్తి చేసి సంసిద్ధంగా ఉంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ఏర్పాట్లపై బుధవారం టీటీడీసీలో కలెక్టర్ గౌతమ్‌తో కలిసి విద్యా, వైద్య, సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొని సాధారణ స్థితికి చేరుకున్నామన్నారు. పాఠశాలలు నిరంతరాయంగా మూతపడడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. జిల్లాలోని 1,627 పాఠశాలల్లో నమోదై ఉన్న 1,76,969 మంది విద్యార్థులు తిరిగి తరగతులకు హాజరయ్యేలా సత్వర చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో పారిశుధ్య, పరిశుభ్రత పనులను ముమ్మరం చేసి ప్రతి తరగతి గదినీ శానిటైజ్ చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులతోపాటు వంట మనుషులు కూడా తప్పనిసరిగా కొవిడ్ టీకా తీసుకోవాలని ఆదేశించారు. అన్ని విద్యాసంస్థల్లోనూ మౌలిక వసతులు కల్పించి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఐదు రోజుల్లో సిద్ధం చేస్తాం
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో విద్యాసంస్థల పునఃప్రారంభం ఏర్పాట్లపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చామని అన్నారు. రాబోయే ఐదు రోజుల్లో అన్ని పాఠశాలలనూ సిద్ధం చేస్తామన్నారు. ప్రతి విద్యార్థీ మాస్కు ధరించేలా చూడాలన్నారు. పల్స్ ఆక్సీమీటర్లు , థర్మామీటర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డీఈవో యాదయ్య, సంక్షేమ అధికారులు జ్యోతి, సత్యనారాయణ, కృష్ణనాయక్, ఆర్సీవోలు పాల్గొన్నారు.