
రూ.8కోట్లతో అభివృద్ధి పనులు
ఎమ్మెల్యే హరిప్రియ చొరవతో పనుల్లో వేగం
ఇల్లెందు మార్కెట్‌కు పూర్వవైభవం
ఇల్లెందు, జూన్ 25 : ఇల్లెందు మార్కెట్ అడవి ఉత్పత్తులకు నిలయం.. ఇక్కడ అన్ని వస్తువులు లభించేవి.. ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్.. సింగరేణి కార్మికుల కోసం బ్రిటీష్ పాలకులు ఈ మార్కెట్‌కు పునాది వేశారు. అదే రీతిలో అభివృద్ధి చేశారు. వంద గదుల కాంప్లెక్స్‌తో కళకళలాడేది. వేలాది కుటుంబాలకు ఉపాధి చూపింది. వలస పాలకుల పుణ్యమాని మార్కెట్ శిథిలావస్థకు చేరింది. పూర్తిస్థాయి కాంప్లెక్స్ నిర్మాణం లేక వెలవెలబోతుంది. వందలాది మంది ఉపాధి కోల్పోయారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మార్కెట్‌కు పూర్వవైభవం సంతరించుకున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఇల్లెందు మార్కెట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం మార్కెట్ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
ఇల్లెందు కూరగాయల మార్కెట్ రాష్ట్రంలోనే పేరుగాంచింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్‌తో నాడు పోల్చేవారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో వంద గదుల కాంప్లెక్స్‌తో ఒకప్పుడు కళకళలాడింది. వందలాది మంది వ్యాపారులు మార్కెట్ ఆధారంగా జీవించేవారు. మరెంతో మందికి ఉపాధిని చూపింది. 1856లో సింగరేణి కార్మికులను దృష్టిలో పెట్టుకొని బ్రిటీష్ పాలకులు పట్టణ నడిబొడ్డున మార్కెట్‌ను ప్రారంభించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో వంద గదుల కాంప్లెక్స్‌ను నిర్మించారు. మోండా మార్కెట్‌తో ఇల్లెందు మార్కెట్ కొన్ని దశాబ్దాలపాటు పోటీ పడింది. వలస పాలకులు అధికారం చేపట్టిన తరువాత ఆ మార్కెట్ అభివృద్ధి కుంటుపడుతూ వచ్చింది. వ్యాపారులు పలుమార్లు నాటి అధికారులు, మంత్రులు దృష్టికి తీసుకెళినా పట్టించుకోలేదు. శిథిలమవుతున్న గదులు, కుప్పకూలుతున్న నిర్మాణాలతో విసిగిపోయి వ్యాపారులు రోడ్డున పడ్డారు. చాలీచాలక ఇరుకు స్థలాల్లో రోడ్డు మీద వ్యాపారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ అభివృద్ధికి రూ.8 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీంతో మార్కెట్‌కు మంచి రోజులు వచ్చాయి. 2020లో పునాది రాయి వేసినప్పటికీ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ ప్రత్యేక దృష్టిసారించారు. సంబంధిత గుత్తేదారులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు.
దొరకని వస్తువు లేదు
ఒకప్పుడు ఇల్లెందు మార్కెట్లో దొరకని వస్తువులేదు. మోండా మార్కెట్లో లభించని వస్తువులు ఇక్కడ లభించేవి. నిత్యావసర వస్తువులు, చికెన్, మటన్, చేపలు, కూరగాయలు, కిరాణం, హోటళ్లు, వైన్‌షాపులు, బార్బర్ షాపులు, పెట్రోల్ బంకు, అడవి ఉత్పత్తులు బంక, జిగురు, చీపుర్లు, తేనె, విప్పపువ్వు తదితర వస్తువులన్నీ లభ్యమయ్యేవి. అంతేకాదు, వస్త్రదుకాణాలు, జ్యూయలరీ, ఫ్యాన్సీ, చెప్పుల షాపులు, మిగతా మరెన్నో లభించేవి. మార్కెట్‌కు వచ్చేవారికి గుండు పిన్ను నుంచి అన్నీ లభించేవి. ఇంతటి చరిత్ర ఉన్న ఇల్లెందు మార్కెట్‌పై నాటి పాలకులు వివక్ష చూపారు. చరిత్రను సమాధి చేశారు. ఫలితంగా వందలాది మంది వ్యాపారులు నష్టపోయారు.
మున్సిపాలిటీకి భారీ ఆదాయం
రూ.8 కోట్లతో చేపట్టిన పనుల ద్వారా మున్సిపాలిటీకి భారీ ఆదాయం రానుంది. మొత్తం 192 గదుల కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు. తద్వారా మున్సిపాలిటీకి ఎక్కువ ఆదాయం రానున్నది. విక్రయదారులు, వ్యాపారులు సజావుగా వ్యాపారం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తాయిబజార్కు ఫుట్‌పాత్ వ్యాపారులు రోజుకు ఐదు నుంచి పది రూపాయలు ఇస్తున్నారు. ఫుట్ పాత్‌పై గంప మీద విక్రయిస్తే పది రూపాయలు, షాపు, బండి మీద విక్రయిస్తే ఇరవై రూపాయలు చెల్లిస్తున్నారు. సంవత్సరానికి మున్సిపాలిటీకి రూ.40 నుంచి 50 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. దీంతో ఇంకా మార్కెట్‌ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఫుట్‌పాత్ వ్యాపారులు ఉండే అవకాశం ఉండదు. పైగా ఉత్పత్తులు, వస్తువులు పెరుగుతాయి. వందలాది మందికి ఉపాధి కలుగుతుంది. వ్యాపారులకూ పూర్వవైభవం లభిస్తుంది. బొగ్గుట్ట చరిత్రకు మార్కెట్ అద్దం పడుతుంది. ఈ దిశగా ఎమ్మెల్యే కూరగాయల మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎంతో చరిత్ర కలిగిన మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.