కారేపల్లి, డిసెంబర్ 19 : ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబ రెండున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఆ గ్రామ పంచాయితీకి ప్రథమ పౌరులు కావాలని దాదాపు 25 ఏళ్లు అవకాశం కోసం అలిసిపోకుండా పోరాటం చేస్తూ ఎదురుచూస్తూనే ఉన్నారు. రిజర్వేషన్లలో భాగంగా భార్య కాకపోతే భర్త, భర్త కాకపోతే భార్య ఎన్నికల బరిలో దిగి వరుసగా ఓటమిని చవి చూశారు. ప్రజాసేవ పట్ల, గ్రామాభివృద్ధి పట్ల వారికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ, అవకాశం వచ్చేంత వరకు ఓపిక పట్టి ఎదురుచూడటం వారికి కలిసి వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ మూడో విడుత ఎన్నికలో ఆ ఇంట్లో ఇద్దరు గెలిచి తమ కలను సహకారం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని పేరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బానోత్ పద్మావతి, వార్డు సభ్యుడుగా ఆమె భర్త వీరభద్రం నాయక్ గెలుపొందారు. అయితే వీరభద్రం పేరుపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తన తల్లిని సర్పంచ్ బరిలో నిలపగా 200 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత తాను రెండుసార్లు పోటీలోకి దిగి 200కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2019లో జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లలో వీరభద్రం కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడి బీఆర్ఎస్ అభ్యర్థిపై మూడు ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈసారి పేరుపల్లి గ్రామ పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో తన భార్య బానోతు పద్మావతిని కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిపాడు. దీంతో ఆమె తన ప్రత్యర్థిపై 517 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అదేవిధంగా వీరభద్రం కూడా 5వ వార్డు సభ్యుడిగా గెలుపొందాడు. దీంతో వారి పాతికేళ్ల నిరీక్షణకు తెరపడినట్లు కావడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.