మణుగూరు టౌన్, సెప్టెంబర్ 3: మణుగూరులో ముంపునకు గురైన వరద బాధితులకు న్యాయం చేయాలని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి మణుగూరు పట్టణంలోని పూలమార్కెట్ వద్ద ధర్నా చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు రేగాను బలవంతంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ మణుగూరుతోపాటు మామిళ్లవాయి, తిర్లాపురం, రామానుజవరం, పగిడేరు, అశ్వాపురం తదితర గ్రామాలు నీట మునిగాయన్నారు. మణుగూరు సుందరయ్యనగర్‌లో పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం కనీసం బ్లీచింగ్ కూడా చల్లించలేదని, వెంటనే ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వరద బాధితులకు మనోధైర్యం కల్పించాల్సిన ప్రజాప్రతినిధులు అడ్రస్ లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో వరదలు వచ్చినప్పుడు కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేసి రెండురోజుల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ప్రతి ఇంటికి రూ.10 వేలు అందించామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.