
ఖమ్మం, నవంబర్ 24: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆయనను శాసనమండలికి పంపాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఓటర్లలో 80 శాతం టీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారని, గెలుపు ఏకపక్షమేనని అన్నారు. ప్రతి ఓటరూ తాతా మధు గెలుపులో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో ఓటు వేసే విధానంపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అత్యధిక మెజారిటతో మధును గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు, కేఎంసీ మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ అధ్యక్షుడు కమర్తపు మురళి, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, రఘునాథపాలెం జడ్పీటీసీ ప్రియాంక, టీఆర్ఎస్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.