
జూలై1నాటికి సన్నద్ధం చేసేందుకు ముందస్తుగా హాజరు
పూర్తవుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్24: వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి ఉపాధ్యాయులు బడికి వెళ్లనున్నారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 27వ తేదీన సెలవులను ప్రకటించిన ప్రభుత్వం తర్వాత పరిస్థితుల్లో సెలవులను జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ నెల 25వ తేదీ నుంచి పాఠశాలలకు టీచర్లు, కళాశాలలకు అధ్యాపకులు హాజరుకానున్నారు. విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు జూలై1వ తేదీ నుంచి హాజరుకానున్న నేపథ్యంలో విద్యాసంస్థ్ధలను సన్నద్ధం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి సంబంధిత టీచర్లతో ఆన్లైన్ సమావేశాలు నిర్వహించి సూచనలు చేశారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్..
విద్యాసంస్థ్ధలు తెరుచుకుంటున్న క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కొవిడ్ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి డోస్, రెండో డోస్ టీకాలు చాలా మంది వేయించుకోగా, వేయించుకోని వారందరికీ ఐడీ కార్డుల ఆధారంగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఆయా మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా కేటాయించిన కేంద్రాల్లో గురువారం వ్యాక్సిన్ వేశారు. గురువారం ప్రభుత్వ పాఠశాలలోని టీచర్లు 214 మంది, ప్రభుత్వపాఠశాలలోని నాన్ టీచింగ్ స్టాఫ్ 200 మంది, ప్రైవేట్ టీచర్లు 418 మంది, నాన్ టీచింగ్ 111 మంది, మొత్తంగా 959 మందికి టీకా వేశారు.
ఈ ప్రక్రియను డీఈవో యాదయ్య పరిశీలించారు.
1627 స్కూల్స్..
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో 1627 పాఠశాలలు ఉన్నాయి. జూనియర్ కళాశాలలు 109 వరకు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు 5,048 మంది కాగా, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు 370 మంది వరకు ఉన్నారు.
స్కూల్స్ సన్నద్ధం చేయాలి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు టీచర్లందరూ పాఠశాలలకు హాజరు కావాలి. పంచాయతీల సహకారంతో పాఠశాల ఆవరణ, తరగతి గదులను శానిటైజేషన్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు పరిశీలించనున్నారు. ఈ సమావేశంలో పాఠశాలల సన్నద్ధతకు స్పష్టమైన
-డీఈఓ యాదయ్య
బోధనకు అనుగుణంగా..
జూలై 1వ తేదీ నుంచి ప్రత్యక్ష, ఆన్లైన్ బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. తరగతుల వారీగా విద్యార్థుల వివరాలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు, శానిటైజేషన్‌పై ప్రిన్సిపాళ్లకు సూచనలు చేశాం.