
పింఛన్ అర్హత వయస్సు 60 నుంచి 57ఏళ్లకు తగ్గింపు
వెల్లువలా వస్తున్న దరఖాస్తులు
ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు
సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తుల పరిశీలన
పెరుగనున్న లబ్ధిదారులు
ఖమ్మం, ఆగస్టు 23: (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం సబ్బండవర్గాలకు అండగా నిలుస్తోంది. చేతి, కుల వృత్తులకు చేయూతనిస్తుండగా.. వృద్ధులకు ‘ఆసరా’తో భరోసా కల్పిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును కుదించారు. గతంలో 60 ఏళ్లు ఉండగా.. ప్రస్తుతం 57 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో 57 ఏళ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి అర్హుల జాబితాను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటి వరకు వారిలో 29,448 మంది అర్హులు ఉన్నట్లు గుర్తించారు. పింఛను కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగనున్నది. ఇది పూర్తి అయితే పింఛన్‌దారుల సంఖ్య భారీగా పెరుగనున్నది.
అర్హులైన వృద్ధులకు ఆసరా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వృద్ధాప్య పింఛను పొందేందుకు గల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో ఆసరా పింఛను పొందేందుకు జిల్లాలో అనేకమందికి అవకాశం లభించినట్లయింది. 57 ఏళ్లు నిండిన వారు ఆసరా పింఛనుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో మండలాల్లో అర్హులంతా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 57 ఏళ్లు నిండిన వారిలో 29,448 మంది అర్హులు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించింది. గతంలో నిర్వహించిన ఇంటింటి సర్వే ద్వారా వీరిని గుర్తించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు 57 ఏళ్లు నిండి వృద్ధాప్య పింఛన్‌కు అర్హులైన వారి జాబితాను ఇంటింటి సర్వే ఆధారంగా రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వృద్ధాప్య పింఛన్లు పొందేందుకు అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గిస్తామని 2018 ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. 57 ఏళ్లు నిండిన వారి వివరాలను సేకరించాలని ప్రభుత్వం గతంలోనే జిల్లాల వారీగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించింది.
దీంతో డీఆర్డీఏ అధికారులు ఓటర్ల జాబితా, ఇంటింటి సర్వే ఆధారంగా అర్హుల జాబితాను ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే జిల్లాలో వృద్ధాప్య పింఛన్‌కు అర్హులైన వారు 2019 నుంచి ఈ ఏడాది జూన్ వరకు 13,700 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వీరి దరఖాస్తులను జిల్లా అధికారులు పరిశీలించడం పూర్తికాగానే సవరించిన వయసు ఆధారంగా కొత్త పింఛన్ అందుకోనున్నారు. పింఛన్ల కోసం ప్రతిరోజూ మీసేవ కేంద్రాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు నమోదవుతున్నాయి. 57 ఏళ్ల వయసు పైబడిన వారిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారైతే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారైతే రూ.2 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన వృద్ధులే అర్హులని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. అదేవిధంగా వ్యవసాయ భూమి మూడు ఎకరాల్లోపు ఉన్నవారు సైతం అర్హులని చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వ పింఛను పొందుతున్న వారు, ఆసరా పింఛను పొందుతున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు, పదవీవిరమణ చేసిన ఉద్యోగులు, వృత్తిపరమైన హోదాలో ఉన్న కుటుంబాల వారు, పెద్ద వ్యాపారాలు కలిగిన కుటుంబాల వారు, భారీ వాహనాలు ఉన్నవారు, ప్రభుత్వం నుంచి గౌరవవేతనం పొందుతున్నవారు ఈ పింఛనుకు అనర్హులని స్పష్టం చేసింది. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే 57 ఏళ్లు పైబడిన వృద్ధుల వద్ద ఎలాంటి రుసుమూ తీసుకోవద్దని ప్రభుత్వం ఆదేశించడంతో దరఖాస్తుదారులకు ఊరట కలిగింది. ఆగస్టు 31 వరకు ఇచ్చిన గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వం దరఖాస్తుదారుల వివరాలను మండలాల వారీగా పరిశీలించి పింఛన్ల మంజూరుకు అర్హతను నిర్ధారించనుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కేసీఆర్ ఆపద్బాంధవుడు..
వృద్ధాప్యంలో అనేక కష్టాలు పడే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపద్బాంధవుడు. వృద్ధాప్యంలో కూలి పని చేసుకోలేని వారికి ఆసరా పింఛన్లు అందించేందుకు వయసును తగ్గించడం సంతోషంగా ఉంది. ఆసరా పింఛన్‌తో కనీస కుటుంబ అవసరాలు తీరుతాయి. -తోట యాదయ్య, గుర్రాలపాడు
వృద్ధులకు భరోసా..
మాలాంటి వృద్ధులకు భరోసానివ్వడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పథకంలో అర్హత కోసం వయసు కుదించారు. ఆసరా పింఛన్ పొందడం వల్ల మరొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు తీర్చుకోవచ్చు.
-కొర్ని వెంకయ్య, గుర్రాలపాడు