
వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం
కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులు
అన్ని విద్యాసంస్థల్లో శానిటైజ్ చేయాలి
కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచన
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 23 ;బడి గంట మోగనున్నది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనాతో సుదీర్ఘ కాలంగా మూతబడిన బడులు పునఃప్రారంభంకానున్నాయి. పాఠశాలలు తెరవకపోవడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతున్నదని, వారి భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు బోధించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలను శానిటైజ్ చేసి ప్రారంభించాలని కోరారు. కేజీ నుంచి పీజీ వరకు వచ్చేనెల తరగతులు నిర్వహించనున్నారు.
విద్యాసంస్థల పునః ప్రారంభానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో వచ్చే నెల 1 నుంచి తరగతులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని రకాల విద్యాసంస్థలను తెరవాలని సూచనలిచ్చారు. ఈ మేరకు విద్యాశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. నెలాఖరుకల్లా అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలను సిద్దం చేయాలని, ప్రతి విద్యాసంస్థని శానిటైజేషన్ చేయాలని హుకుం జారీ చేసింది.
అన్ని తరగతులు ఓపెన్..
అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతాయి. కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులు జరుగుతాయి. ఇప్పటికే స్కూల్స్, కళాశాలలకు అధ్యాపకులు హాజరవుతున్నారు. యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించనున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యాలయాలు మూతపడిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తిరిగి ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
శానిటైజేషన్ బాధ్యత పంచాయతీలదే..
ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని స్కూల్స్, ప్రైవేట్ విద్యాసంస్థలను ఈ నెల 30 నెల లోగా తరగతులకు సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో తరగతి గదులు, తాగునీటి ప్లాంట్స్, టాయిలెట్స్, పరిసరాలను యాజమాన్యాలు శుభ్రం చేయించాలి. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు పారిశుధ్య నిర్వహణను పక్కాగా చేపట్టాలి. యాజమాన్యాలు కొవిడ్ నివారణకు సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించాలి. శానిటైజేషన్ పనులను జడ్పీ చైర్మన్, ఎంపీపీలు, డీపీవోలు, ఎంపీవోలు, జడ్పీ సీఈవోలు పర్యవేక్షించనున్నారు.
జిల్లాలో విద్యాసంస్థలు ఇలా..
జిల్లాలో 21 మండలాల పరిధిలో 1,258 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 85,750 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకుల స్కూల్స్, ఇంటర్మీడియట్ కలిపి 3,500 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 19 ఉండగా వీటిలో ప్రథమ సంవత్సరం చదువుతున్న వారు 2,810 మంది, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు 3,500 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 3 వేల మంది, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, నవోదయ స్కూల్స్‌లో వెయ్యి మంది చదువుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 219 స్కూల్స్‌లో 80 వేల మంది విద్యార్థులు, ఇంటర్లో 124 జూనియర్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు 19 వేల మంది విద్యార్ధులు ఉన్నారు. వీటితో పాటు 40కి పైగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, ఎనిమిది ఇంజినీరింగ్, ఎంబీఏ కళాశాలలు, ఐదు ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి.
నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరి..
విద్యాసంస్థలు తెరిచిన తర్వాత తరగతి గదుల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులకు ఎలాంటి చిన్న అస్వస్థత వచ్చినా వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లేలా యాజమాన్యాలు జాగ్రత్తలు పాటించాలి. కొవిడ్ నేపథ్యంలో పాఠశాల పరిసరాలను ప్రతిరోజూ శానిటైజ్ చేయాలి. బడిలో ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలి.
స్కూల్స్ తెరుస్తున్నందుకు కృతజ్ఞతలు..
కరోనా సంక్షోభంలో విద్యాసంస్థలు ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యారు. సీఎం కేసీఆర్ తిరిగి పాఠశాలలను ప్రారంభించడం హర్షణీయం. సీఎంకు స్కూలు యాజమాన్యాల తరఫున కృతజ్ఞతలు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు ..
ప్రైవేట్ పాఠశాలల్లో ప్రధానంగా బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సీఎం కేసీఆర్ విద్యాసంసంస్థల గురించి ఆలోచించి బడులు తెరిపిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాసంస్థలు నడిపిస్తాం. తరగుతుల నిర్వహణకు అనుమతులు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
-చింతనిప్పు కృష్ణచైతన్య, ప్రైవేట్ స్కూల్ యజమాని