
ముగ్గురు మృతి కేసును ఛేదించిన పోలీసులు
నలుగురు నిందితుల అరెస్టు.. పరారీలో మరో వ్యక్తి
వివరాలు వెల్లడించిన సీపీ విష్ణు ఎస్ వారియర్
ఖమ్మం, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వారంతా దయాదులే.. రెండు వర్గాల మధ్య భూతగాదాలు ఉన్నాయి. వారిలో ఒక వర్గానికి చెందిన బోడా చిన్నా పాతకక్షల నేపథ్యంలో ముగ్గురిని మట్టుపెట్టాలని పథకం రచించాడు. మర్వాదపూర్వకంగా ఇంటికి పిలిచి మద్యంలో సైనేడ్ కలిపి వారిని హతమార్చాడు. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ఈ నెల 14న జరిగిన ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను సోమవారం ఖమ్మం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ విష్ణు ఎస్ వారియర్ వెల్లడించారు. చంద్రుతండాకు చెందిన బోడా హరిదాస్ (60), బోడా మల్సూర్(29), బోడా భద్రు(40)కు బోడా చిన్నా అనే ఆర్ఎంపీ వైద్యుడికి మధ్య భూతగాదాల నేపథ్యంలో పాతకక్షలు ఉన్నాయి. బోడా చిన్నా వారిని ఎలాగైనా మట్టుపెట్టాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. అందుకు ఈనెల 14న తండాలో బోడా చిన్నా సోదరుడి దశ దిన కర్మను సరైన సందర్భంగా చిన్నా భావించాడు. బోడా హరిదాస్, బోడా మల్సూర్, బోడా భద్రును బోడా చిన్నా మర్వాదపూర్వకంగా ఇంటికి పిలిచాడు. వారితో మంచిగా మాట్లాడాడు. వారిని మాటల్లో పెట్టాడు. ముందు పథకం రచించిన విధంగా మద్యంలో సెనైడ్ కలిపి వారితో తాగించాడు. మద్యం తాగిన కాసేపటికి ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ముగ్గురూ మృతిచెందారు. ముగ్గురి మృతి తండాలో కలకలం రేపింది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకున్నారు. ముగ్గురూ విషప్రయోగం వల్ల మృతిచెందారని నిర్ధారణకు వచ్చారు. ప్రధాన నిందితుడు బోడా చిన్నాతో పాటు అతనికి సహకరించిన ధరావత్ పోలీసింగ్, నందనూరి సుదర్శన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహ్మద్ సలీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు బోడా బిచ్చా పరారీలో ఉన్నాడని సీపీ తెలిపారు. పాతకక్షల నేపథ్యంలోనే చిన్నా విషప్రయోగం చేశాడన్నారు. చాకచక్యంగా వ్యవహరించి వారం రోజుల్లో కేసును ఛేదించిన ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, కూసుమంచి సీఐ సతీశ్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి ఎస్సైలు రఘు, సందీప్, అశోక్‌ను సీపీ అభినందించారు. సమావేశంలో ట్రైనీ ఎస్పీ స్నేహామెహరా, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.