రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. తొలకరి నుంచి పంట చేతికి అందే వరకు రైతుకు వెన్నంటే నిలుస్తున్నది. పెట్టుబడి అందిస్తున్నది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పండించిన పంట దళారుల పాలుకాకుండా మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది యాసంగి ధాన్యం సేకరణకు జిల్లా పౌరసరఫరా శాఖ ఆధ్వర్యంలో అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. ఖమ్మం జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోటి గన్నీ బ్యాగులను సిద్ధం చేస్తున్నారు. నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించారు.
ఖమ్మం, మార్చి 10 : ఖమ్మం జిల్లాలో 82,303 హెక్టార్లలో రైతులు యాసంగి వరి సాగు చేశారు. హెక్టారుకు 6,180 మెట్రిక్ టన్నులు దిగుబడి చొప్పున 5,08,645 మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని వ్యవసాయ, పౌర సరఫరాల అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిలో స్థానిక ప్రజల అవసరాలకు 54,625 మెట్రిక్ టన్నులు పోగా మిగిలిన 4లక్షల 34వేల 18 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. మిల్లర్లు నేరుగా 34,018 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు, మిగిలిన 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 234 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
జిల్లాలో యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా అధికారులు 234 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. వాటిలో డీఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో 53, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 148, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 29, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోటి గన్నీ బ్యాగులు అవసరం ఉండగా ప్రస్తుతం 54లక్షల బ్యాగులు సిద్ధంగా ఉండగా, ఒకసారి వినియోగించినవి 6 లక్షలు ఉన్నవి.. ఇవి కాకుండా ఇంకా 40 లక్షల బ్యాగులను సిద్ధం చేసేలా ప్రణాళిక తయారు చేశారు. సెంటర్లలో తాగునీటి వసతి, కరెంట్, టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ స్కేల్స్, మాశ్చరైజ్ మీటర్లు తదితర వాటిని ముందస్తుగానే ఏర్పాటు చేయనున్నారు. మహిళలకు తాత్కాలిక మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వరి ధాన్యం గ్రేడ్-ఏ రకం క్వింటాకు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర అందిస్తున్నది.
ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ మూడో వారంలో ధాన్యం వస్తుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఏప్రిల్ 23 నుంచి జూలై 23వ తేదీ వరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం చేతికందే సమయంలో రైతన్నకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నది. వచ్చే నెలలో యాసంగి వరి కోతలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. అందుకనుగుణంగా రైతుల చెంతనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని రోజుల్లో మార్కెట్లో వ్యాపారులదే రాజ్యం. సిండికేట్‌గా వారు నిర్ణయించిన ధరకే రైతులు ధాన్యాన్ని అమ్ముకునేవారు. దీంతో తీవ్రంగా నష్టపోయేవారు. తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండడంతో రైతులకు మేలు కలుగుతున్నది. ‘ఏ’ గ్రేడ్ వరి క్వింటాల్‌కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. దీంతో అక్రమాలకు తెర పడింది.
కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ కోసం తరలించనున్నారు. రైస్‌మిల్లులో కస్టమ్ మిల్లింగ్ చేయిస్తే నూకల శాతం అధికంగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో ఒక లారీకి సరిపడా వరి ధాన్యం బస్తాల తూకం పూర్తయిన వెంటనే కస్టమ్ మిల్లింగ్ కోసం తరలిస్తారు. ఈ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయబడతాయి. వారంరోజుల్లోపే ఈ డబ్బులు అందుతాయి.
జిల్లాలో ఈ యాసంగిలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు 234 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. సరిపడా గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచాం. సెంటర్లలో తాగునీరు, కరెంట్, టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ స్కేల్స్, మాశ్చరైజ్ మీటర్లు తదితర సౌకర్యాలు కల్పిస్తాం. మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తాం. రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి.
– వీ నర్సింహారావు, అసిస్టెంట్ మేనేజర్, పౌర సరఫరాలశాఖ