
ఖమ్మం కల్చరల్, నవంబర్ 22: కార్తీక సోమవారం సందర్భంగా నగరంలోని శ్రీభ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో కొలువైన స్వయంభు స్వామిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, వసంతలక్ష్మి దంపతులు సోమవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ కమిటీ బాధ్యులు, అర్చకులు కలిసి అజయ్ దంపతులకు పూర్ణకుంభంతో శాస్ర్తోక్తంగా స్వాగతం పలికారు. అజయ్ దంపతులు ఆలయంలో స్వయంభు స్వామిని దర్శించుకుని పంచామృతాలతో అభిషేకం చేశారు. అర్చకులు దాములూరి వీరభద్రశర్మ, దాములూరి కృష్ణశర్మలు శాస్ర్తోక్తంగా పూజలు చేయించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంత్రి అజయ్‌కుమార్‌ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యంత మహిమాన్వితమైన గుంటు మల్లన్న స్వామిని సేవిస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. ఆలయాల అభివృద్ధికి, అర్చకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పడుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఆలయాలకు వైభవం వచ్చిందని పేర్కొన్నారు.