
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
రూ.20లక్షలతో సీసీ రోడ్లు
సకల సౌకర్యాలతో వైకుంఠధామం
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం
అన్నదాతల కోసం రైతువేదిక నిర్మాణం
ఏన్కూరు, ఆగస్టు 22 : మండలంలోని జన్నారం గ్రామపంచాయతీ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గ్రామంలో వైకుంఠధామం, రైతువేదిక, కంపోస్టుషెడ్, పల్లె ప్రకృతి వనాలు సమకూరడంతో కళకళలాడుతున్నది. రహదారుల వెంట నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో గ్రామానికి కొత్తశోభ సంతరించుకుంది. సర్పంచ్ ధరావత్ పద్మ, ఉపసర్పంచ్ రామారావు ప్రభుత్వ నిధులతో పాటు, తమ సొంత నిధులతో ప్రకృతివనాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడియం నుంచి 5 వేల వివిధ రకాల పండ్ల, పూలు, నీడనిచ్చే మొక్కలు తెచ్చి నాటారు. వాటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో అవి ఏపుగా పెరుగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం మధ్యలో ఆకర్షణగా నిలిచింది. ఏన్కూరు -పల్లిపాడు ప్రధాన రహదారి మధ్యన ఈ గ్రామం ఉండడంతో వచ్చే ప్రయాణికులు ఈ వనంలో ఆహ్లాదాన్ని పొందుతూ సేదతీరుతున్నారు. వంద శాతం ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది.
పాలకవర్గం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రతిరోజూ చెత్తను ట్రాక్టర్ ద్వారా డంపింగ్‌యార్డుకు తరలించడం వల్ల వీధులన్నీ శుభ్రంగా కనిపిస్తున్నాయి. వీధుల వెంట బ్లీచింగ్ చల్లడం, నెలలో రెండుసార్లు హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయడంపై పాలకవర్గం ప్రత్యేక దృష్టిపెట్టింది. నిరంతరాయంగా డ్రైడే- ఫ్రైడే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామంలో పాత విద్యుత్ స్తంభాలు తొలగించి కొత్తస్తంభాలు ఏర్పాటు చేశారు. వీటికి ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయడంతో విద్యుత్కాంతులు విరజిమ్ముతున్నాయి. మిషన్ భగీరథతో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం లభించింది. పాడుబడ్డ ఇళ్లను, బావుల్ని తొలగించి, మురికిగుంటల్ని పూడ్చి పారిశుధ్యంపై పంచాయతీ సిబ్బంది శ్రద్ధ వహించింది. హరితహారంలో వేసిన మొక్కలు, నర్సరీలోని మొక్కలకు ట్యాంకర్ ద్వారా ప్రతిరోజూ నీళ్లు పోయడంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి.
గ్రామాభివృద్ధికి కృషి
గ్రామాభివృద్ధే ధ్యేయంగా అహర్నిషలు శ్రమిస్తున్నా. ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్నా. గ్రామంలో అందరి సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధికి తోడ్పాడుతాం.
ఆదర్శం జన్నారం పంచాయతీ
పల్లెప్రగతి పనుల్లో జన్నారం ఆదర్శ పంచాయతీగా నిలిచింది. పల్లెప్రగతి పనుల్ని సకాలంలో పాలకవర్గం పూర్తిచేసింది. గ్రామాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.