
ఆనందాలు నింపిన శ్రావణ పూర్ణిమ
అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టిన సోదరీమణులు
ఆత్మీయతల నడుమ రాఖీ పండుగ
ఖమ్మం కల్చరల్, ఆగస్టు 22 : అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్.. అచ్చమైన తోబుట్టువుల పండుగ.. ఆదివారం శ్రావణ పూర్ణిమ అన్నాచెల్లెళ్ల బంధంలో సంతోషాలు నింపింది. సోదరులకు రాఖీ కట్టి అక్కాచెల్లెళ్లు ఒకరికొకరు ఆత్మీయతను పంచుకున్నారు.. మిఠాయిలు తినిపించుకుంటూ, చిన్న నాటి మధుర జ్ఞాపకాలు పంచుకుంటూ సందడి చేశారు.. మొత్తానికి ఈ పండుగ వారికి మధుర జ్ఞాపకమైంది.
రంగు రంగుల రాఖీలు సోదరుల మణికట్టుపై అలరారాయి.. సోదరీమణుల మోముల్లో సంతోష కాంతులు వెదజల్లాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని ఆదివారం ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య సోదర బంధం మరింత బలోపేతమైంది. దూర ప్రాంతాల నుంచి పుట్టింటికి వచ్చిన ఆడపడుచులు తమ సోదరులకు రాఖీలు కట్టి తమకు జీవితాంతం రక్షణగా, భద్రతగా ఉండాలని కోరుకున్నారు. సోదరులు తమ అక్కా, చెల్లెళ్లు సకల సౌభాగ్యాలతో ఉండాలని ఆశీర్వదించి బహుమానాలు అందజేశారు. అనంతరం స్వీట్లు, రుచి కరమైన ఆహార పదార్థాలను తీసుకుని కుటుంబమంతా ఆనందంగా గడిపారు. జంధ్యాల పున్నమిగా పిలువబడే ఈ రోజు బ్రాహ్మణ యువకులు సంప్రదాయంగా, శాస్ర్తోక్తంగా నూతన యజ్ఞోపవీతధారణ చేశారు. వేదోద్దారకుడు హయగ్రీవ జయంతి పురస్కరించుకుని భక్తులు హయగ్రీవునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పలు శైవ, వైష్ణవ ఆలయాల్లో భక్తులు తమ తమ ఇష్ట దైవాలను దర్శించుకుని పూజించారు.
నగరంలోని బ్రహ్మకుమారి విద్యాలయం బ్రహ్మకుమారీలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు రాఖీ కట్టి సోదరభావాన్ని చాటారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ రాఖీ పండుగ సోదర బంధాన్ని, కుటుంబ విలువలను పెంచుతుందని, మానవ సంబంధాలను పెంచడంలో ఇటువంటి సంప్రదాయ పండుగలు ఎంతో ఉపయుక్తమవుతాయన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ నామా, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్‌రాజ్, కోరం కనకయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని, టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్ర తదితర ప్రముఖులు రాఖీలు కట్టించుకున్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పలువురికి రాఖీలు కట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, అధికారులకు సోదరీమణులు రాఖీలు కట్టి సోదర భావాన్ని పెంపొందించారు.