
ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ‘పేపర్ పెన్సిల్’
భద్రాద్రి జిల్లాలో విద్యాశాఖ వినూత్న ఆలోచన
అభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రణాళికలు
విద్యార్థుల ఆవాసాల్లో బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న అడ్మిషన్లు
కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఆగస్టు 20: గతేడాది మార్చి నుంచి కరోనా కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. గత నెల 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభమైనప్పటికీ 1, 2 తరగతులు చదివే విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ప్రస్తుతం 3వ తరగతి చదువుతున్న పిల్లలూ గతేడాది 2వ తరగతి పాఠాలకు దూరమయ్యారు. వారిలో అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతున్నాయనే విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఎలిమెంటరీ విద్యార్థుల కోసం ‘పేపర్ పెన్సిల్’ అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. భద్రాద్రి జిల్లాలో విభిన్నమైన భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా విద్యాశాఖ పక్కాగా ప్రణాళికలు అమలు చేస్తున్నది.
ఊపందుకున్న అడ్మిషన్లు..
జిల్లాలోని 940 ప్రభుత్వ పాఠశాలల్లో ‘పేపర్ పెన్సిల్’ కార్యక్రమం ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ఆవాసాలకు వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. ముఖ్యంగా 1, 2 తరగతులకు చెందిన విద్యార్థుల చదువుపై దృష్టి సారించి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలను పునరుద్ధరిస్తున్నారు. చిన్నారులకు విద్యను మరింత చేరువ చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు మందకొడిగా ఉన్న అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఊపందుకున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల నుంచి 1వ తరగతిలో 452 మంది, రెండో తరగతిలో 383 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం విశేషం. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో 5,425 మంది, 2వ తరగతిలో 3,853 మంది ఉన్నారు. ‘పేపర్ పెన్సిల్’ ద్వారా అడ్మిషన్లు పెరగడం గమనార్హం. సర్కార్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను దాతలు ప్రోత్సహిస్తున్నారు. వారికి నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, పలకలు, శానిటైజర్లు అందిస్తున్నారు. కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈవోలు, సెక్టోరియల్ అధికారులు, సీఆర్పీలు బాధ్యతగా పనిచేస్తూ పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నారు.
ప్రణాళికల అమలు ఇలా..
ప్రతిరోజు ఉపాధ్యాయులు వంతుల వారీగా విద్యార్థులు ఉండే ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఉండే పిల్లలందరినీ ఒకచోట జమ చేస్తారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠాలు బోధిస్తారు. ఆట పాటల ద్వారా విద్యార్థులు విద్య నేర్చుకునేలా చేస్తారు. రెండో వారంలో అక్షరాలు నేర్పిస్తారు. బొమ్మలతో పాటు ఇతర సామగ్రి ద్వారా బోధిస్తూ విద్యార్థులకు విద్యపై ఆసక్తి చూపించేలా బోధిస్తారు. వర్క్షీట్లు అందించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తారు. మూడో వారంలో పిల్లలకు ప్రాథమిక గణిత భావనలపై అవగాహన కల్పిస్తారు. వర్క్షీట్లు అందించి ఉపాధ్యాయులు వాటిని మూల్యాంకనం చేస్తారు. నాలుగోవారం పిల్లల శరీర భాగాలు, మొక్కల భాగాలు, వ్యక్తిగత పరిశుభ్రత, కుటుంబం లాంటి సాధారణ అంశాలపై అవగాహన కల్పిస్తారు. వర్క్ షీట్లు అందించి పిల్లల సామర్థ్యాలను అంచనా వేస్తారు.
మారుమూల గూడేల్లోనూ..
ఆదివాసీల నివాసాల్లో మొబైల్స్, టీవీలు ఉండే అవకాశం లేకపోవడం, సెల్‌ఫోన్స్ సిగ్నల్స్ లేకపోవడం వంటి సాంకేతిక కారణాలతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉన్నది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో గొత్తి కోయలు ఎక్కువగా నివసిస్తున్న గుండాల, ఆళ్లపల్లి, రేగళ్ల, మామిలవాడీ, గంగదేవి గుప్ప, పూసల గుప్ప, రామచెలక వంటి మారుమూల గిరిజన గూడేలకూ ఉపాధ్యాయులు వెళ్తున్నారు. పంచాయతీ కార్యాలయాలు, అందరూ గుమిగూడే ప్రాంతంలో తాత్కాలిక బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేసి పాఠాలు బోధిస్తున్నారు.
బోధనపై దృష్టి..
కొవిడ్ కారణంగా పాఠశాలలకు దూరమైన విద్యార్థుల కోసం ‘పేపర్ పెన్సిల్’ కార్యక్రమాన్ని రూపొందించాం. వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఉపాధ్యాయులు చొరవ తీసుకుని విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నది. స్వచ్ఛంద సేవా సంస్థలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. దాతలు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు అందిస్తున్నారు. – సోమశేఖరశర్మ, డీఈవో, కొత్తగూడెం